Telugu Global
WOMEN

పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు! జాగ్రత్తలు ఇలా..

‘గ్లోబల్‌ క్యాన్సర్‌ అబ్జర్వేటరీ’ రిపోర్ట్ ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకో క్యాన్సర్ కేసు నమోదవుతోందట.

పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు! జాగ్రత్తలు ఇలా..
X

పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు! జాగ్రత్తలు ఇలా..

మనదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ‘గ్లోబల్‌ క్యాన్సర్‌ అబ్జర్వేటరీ’ రిపోర్ట్ ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకో క్యాన్సర్ కేసు నమోదవుతోందట. ప్రతి ఏటా సుమారు 1,78,000 కొత్త కేసులొస్తున్నాయని ఆ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ ప్రమాదకరమైన మహమ్మారి నుంచి బయటపడేందుకు మార్గాలేంటంటే..

మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉందని రిపోర్ట్‌లు చెప్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌‌కు జన్యు పరమైన కారణాలతో పాటు లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ కూడా కారణమవుతున్నాయి.

ఫ్యామిలీలో ఉంటే

జన్యు పరమైన కారణాల వల్ల వచ్చే క్యాన్సర్‌‌ను నివారించడం కష్టం. కానీ, ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టయితే వాళ్లు బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 వంటి జెనెటిక్ టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటిలో పాజిటివ్ అని వస్తే.. రొమ్ము క్యాన్సర్‌ రిస్క్ ఉన్నట్టు లెక్క. వీళ్లు ముందుగానే డాక్టర్ల సలహా మేరకు సర్జరీల వంటివి చేయించుకోవచ్చు.

లైఫ్‌స్టైల్ ఇలా

జన్యు పరమైన కారణాలతో పాటు అతిగా బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వంటి కారణాల వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంటుంది. అధికంగా బరువు పెరగడం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ ముప్పు మరీ ఎక్కువవుతోంది. కాబట్టి మహిళలు వయసుపెరిగే కొద్దీ బరువుపై శ్రద్ధ పెట్టాలి. పోషకాహారం తీసుకుంటూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

ముందే గుర్తించొచ్చు

రొమ్ము పరిమాణంలో ఏవైనా తేడాలు గమనించినా, గడ్డల వంటివి గుర్తించినా, పుండ్లు వంటివి వచ్చినా.. అది రొమ్ము క్యాన్సర్ లక్షణం అవ్వొచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్లు మామోగ్రఫీ, ఎమ్‌ఆర్‌‌ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే వంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ అవునా? కాదా? అన్నది నిర్ధారిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ఉంటే వెంటనే చికిత్స మొదలుపెడతారు. రొమ్ము క్యాన్సర్‌‌కు ప్రస్తుతం సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి కొన్ని ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి కోలుకోవడం అసాధ్యమేమీ కాదు.

First Published:  4 Nov 2023 4:15 PM IST
Next Story