Telugu Global
WOMEN

జీ20 సదస్సులో.... సిసిటీవీ కెమెరాల పర్యవేక్షణకు మహిళా పోలీసులు

మనదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందికి అధికారులు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటిపిఓ) లోని సిసిటీవీ కమాండ్ రూమ్ పర్యవేక్షణా బాధ్యతలను మహిళా సిబ్బందికి ఇచ్చారు.

జీ20 సదస్సులో.... సిసిటీవీ కెమెరాల పర్యవేక్షణకు మహిళా పోలీసులు
X

మనదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందికి అధికారులు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటిపిఓ) లోని సిసిటీవీ కమాండ్ రూమ్ పర్యవేక్షణా బాధ్యతలను మహిళా సిబ్బందికి ఇచ్చారు. ఈ టీమ్ లో 150మంది మహిళా పోలీసులున్నారు. వీరంతా జీ20 సదస్సు జరిగే ప్రదేశం ఉన్న ప్రగతి మైదాన్ లోని ఐటిపిఓ భద్రత కోసం నియమితులయ్యారు.

మహిళా పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి... ఒక బృందం సిసిటీవీ ఫీడ్ పర్యవేక్షణకు మరో బృందం కమ్యునికేషన్ నిర్వహణకు పనిచేస్తారు. ఐటిపిఓ ఆవరణలో ఏర్పాటు చేసిన 1000 సిసిటీవీ కెమెరాల తాలూకూ ఫీడ్ ని విశ్లేషించాల్సి ఉంటుంది.

ఈ మహిళా బృందంలోని సిబ్బంది సదస్సు జరిగే ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన చోట్ల నిఘా ఉంచుతారు. అలాగే ప్రతి పాయింట్ భద్రతా అధికారితోనూ నేరుగా కమ్యునికేషన్ లో ఉంటారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో ఉన్న మహిళా సిబ్బంది షిఫ్టులవారీగా పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు విధులలో ఉంటారు. డిసిపి ర్యాంకు మహిళా అధికారి ఒకరు వీరి పైఅధికారిగా వ్యవహరిస్తారు.

మహిళా సిబ్బందికి సిసిటీవీ కెమెరాల పర్యవేక్షణపై శిక్షణనిచ్చినట్టుగా తెలుస్తోంది. సదస్సు సందర్భంగా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతాలను గుర్తించడంపైన, అనుమానాస్పదమైన అంశం తమ దృష్టికి వస్తే ఎవరికి ఆ విషయం తెలియజేయాలి అనే అంశంపైన వారికి అవగాహన కల్పించారు. వేదిక వద్ద భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలను వందకు పైగా గుర్తించామని, ఆయా ప్రదేశాలను తాము నిశితంగా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.

సిసి టీవీ పర్యవేక్షణతో పాటు మహిళా సిబ్బందికి వైర్ లెస్ సెట్ ని వినియోగించడం, మెసేజ్ లను పంపటం తీసుకోవటం, ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవటం లాంటి అన్ని విషయాల్లోనూ శిక్షణనిచ్చారు. సదస్సు జరుగుతున్న ప్రదేశంలో 200పైగా అదనపు సిసిటివీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కెమెరాలో ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే దానిని రిపేర్ చేసేలా తగిన చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.

First Published:  8 Sept 2023 8:57 PM IST
Next Story