ఆడపిల్లలు ఎదిగిపోతున్నారు! కారణాలివే !
సాధారణంగా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు 12 నుంచి 15 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. రకరకాల కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు రజస్వల అవుతున్నారు.
అమ్మాయి రజస్వల అయ్యిందంటే.. కౌమారం వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టిందని అర్థం. సాధారణంగా అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే వయసు 12 నుంచి 15 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగా మారిపోయింది. రకరకాల కారణాలతో ఈ వయసు తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా 8 ఏళ్లకు సైతం కొందరు చిన్నారులు రజస్వల అవుతున్నారు.
నిజానికి యుక్త వయసులో వచ్చే శారీరకమైన మార్పులు 10 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పాత తరాల వారితో పోలిస్తే ఈ యుక్త వయసు ప్రక్రియ ఇప్పటి పిల్లల్లో కొంత ముందుగానే మొదలవుతున్నట్టు తెలుస్తోంది. అంటే చిన్నారులు బాల్యం దాటకుండానే.. యవ్వనంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఆడపిల్లలకు చిన్నవయస్సులోనే రుతుక్రమం ప్రారంభమైతే తల్లిదండ్రుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఏమీ తెలియని వయసులో వారు పీరియడ్స్‌ను, శరీరంలోని మార్పులను ఎలా ఎదుర్కొంటారో అని భయం వారిది.
ఎదుర్కొనే ఇబ్బందులివే ..
ఇక రుతుక్రమం త్వరగా ప్రారంభం కావడం వారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎముకల ఎదుగుదల ఆగిపోతుంది. దీనివల్ల ఎనిమిది, తొమ్మిదేళ్లకే.. పెద్దవారిలా ఉంటారు. అసలైన ఎడగాల్సిన వయసుకి వచ్చేసరికి వారిలో ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే చిన్న వయసులోనే రజస్వల అయినవారు, చిన్న వయసులోనే మెనోపాజ్‌కు చేరుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. పునరుత్పత్తి క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధులు, జీవక్రియ రుగ్మతలు, లైంగిక సమస్యలు హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్, థైరాయిడ్ ముప్పు ఉంటుంది. శరీరంలో వచ్చే మార్పుల వల్ల చుట్టుపక్కల ఉండే పిల్లల నుంచి ఒకరకమైన వ్యతిరేకత ఎదుర్కుంటారు. వీటన్నింటితో పాటూ పిల్లలు శారీరికంగా ఎదిగిపోయినా మానసికంగా ఇంకా చిన్న పిల్లలే.
కారణాలేంటంటే..
అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం కూడా బాలికల రజస్వలపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు గుర్తించారు. అంతే కాకుండా స్క్రీన్ టైమ్ కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్నారుల్లో ఒబేసిటీ కూడా త్వరగా పెద్దమనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఒక కుటుంబంలోని మహిళలకు.. అంటే తల్లి, మేనత్త.. ఇలా ఎవరికో ఒకరికి చిన్న వయస్సులోనే పీరియడ్స్ వస్తే.. అదే కుటుంబంలోని ఇతర బాలికలలో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.