పీరియడ్ క్రాంప్స్ తగ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
చాలామంది ఆడవాళ్లకు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే నెలసరి సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ సూపర్‌గా పనిచేస్తాయి.
చాలామంది ఆడవాళ్లకు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం వంటివి కూడా వస్తుంటాయి. అయితే నెలసరి సమయంలో వచ్చే ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఫుడ్స్ సూపర్‌గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇవి అత్యంత సాధారణం కాబట్టి వీటికి మెడిసిన్స్ వాడడం అలవాటు చేసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. కావాలంటే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో వీటి నుంచి రిలీఫ్ పొందే ప్రయత్నం చేయొచ్చు. అదెలాగంటే..
పీరియడ్ క్రాంప్స్‌కు అల్లం బాగా పనికొస్తుంది. అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గించడంలో సాయపడతాయి. నెలసరి సమయంలో గోరువెచ్చని నీటిలో అల్లం రసాన్ని కలుపుకుని ఉదయాన్నే తాగొచ్చు. లేదా అల్లం, నిమ్మరసంతో చేసిన టీ తాగొచ్చు.
కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడానికి సోంపు కూడా చక్కగా పనిచేస్తుంది. ఇవి నొప్పిని తగ్గించడమే కాక, కండరాలను వదులు చేస్తాయి. తద్వారా నొప్పులు తగ్గుతాయి. మరిగించిన నీటిలో సోంపు గింజలను వేసి ఆ నీటిని తాగొచ్చు. లేదా సోంపు గింజలను నేరుగా కూడా తీసుకోవచ్చు.
నెలసరి సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం తీసుకుంటే కడుపులో అసౌకర్యం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. వీటితోపాటు పండ్లు, ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇకపోతే నెలసరి సమయంలో ఉప్పు, కారం, షుగర్, కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే అసౌకర్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. అలాగే నొప్పిగా ఉన్నచోట వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్‌తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.