పీరియడ్స్ సమయంలో ఇబ్బందులను తట్టుకోవాలంటే ఇలా చేయండి
మహిళలకు పీరియడ్స్ పెయిన్స్ నెల నెలా నరకం చూపిస్తాయి.
మహిళలకు పీరియడ్స్ పెయిన్స్ నెల నెలా నరకం చూపిస్తాయి. పురిటినొప్పులు జీవితంలో ఒకటి రెండు సార్లే భరించాలి కానీ.. ఈ పీరియడ్స్ అలా కాదు పిలవని అతిధులలా వస్తూనే ఉంటాయి. యువతులు, బాలికలకు ఇర్రెగ్యూలర్ పీరియడ్స్ చాలా సాధారణ విషయంగా మారింది. పీరియాడ్స్ కు సంబంధించి మహిళలు తప్పకుండా తెలుసుకువాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.. అవేంటంటే
సాధారణ రుతు చక్రం 28 రోజుల నుండి 32 రోజుల మధ్య ఉంటుంది. ప్రతి నెలా ఈ విరామం సాధారణ రేటుతో వస్తుంది. అయితే పీరియడ్స్ వచ్చే ముందు చాలామందికి కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
ఇంకొందరికి.. గందరగోళం, మతిమరుపు, ఏ పని మీదా ధ్యాస లేకపోవడం.. వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాల్లో ఇదీ ఒక్కటని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ఫాగ్ అంటే పీరియడ్స్ వచ్చే ముందు మెదడు మబ్బుమబ్బుగా ఉంటుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో తగ్గుదల సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తుంది.
ఇది మానసిక స్థితి , జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే తీసుకొనే డైట్‌లో ఉప్పు, చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిరంతర వ్యాయామం కూడా పీరియాడ్స్ టైమ్ లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పీరియడ్స్ ముందు.. బ్రెయిన్ ఫాగ్‌ను నివారించడానికి.. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ వ్యాయమాలు.. ఒత్తిడిని, ఆందోళనను కంట్రోల్‌లో ఉంచుతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, దృష్టిని మెరుగుపరుస్తాయి.
ఇక బహిష్టు సమయంలో పాదాలలో నొప్పి లేదా తిమ్మిరి ఉంటే, హీట్ ప్యాడ్‌తో మసాజ్, లావెండర్ లేదా ఆవాల నూనెతో మసాజ్ చేయటం నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.పీరియడ్స్ సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం కూడా ముఖ్యం. పుష్కలంగా నీరు తాగడం వల్ల మంట, నిర్జలీకరణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, శరీరంలో నీటి కొరత తిమ్మిరికి దారితీస్తుంది.
అందుకే ఈ సమయంలో కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీ ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను చేర్చుకోండి. ఐరన్ లోపం లేకుండా చూసుకోవటం కోసం చేపలు, మాంసం, గుడ్లు, ఖర్జూరాలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతీరోజూ తీసుకునే ఆహారం కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే పీరియడ్స్ వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.