పోలీస్ కంట్రోల్ రూము వ్యానుల్లో శానిటరీ నేప్ కిన్లు
ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ యూనిట్ 2016లో అందరూ మహిళలే సిబ్బందిగా పనిచేసే పోలీస్ కంట్రోల్ రూము వాహనాలను ప్రారంభించింది.
ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ యూనిట్ 2016లో అందరూ మహిళలే సిబ్బందిగా పనిచేసే పోలీస్ కంట్రోల్ రూము వాహనాలను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టుగా మొదట అయిదు పిసిఆర్ (పోలీస్ కంట్రోల్ రూము) వ్యానులను ప్రారంభించారు. ఇప్పుడు న్యూఢిల్లీలో అలాంటి పిసిఆర్ వాహనాలు 15 ఉన్నాయి. మహిళా పోలీసులు తమ విధులను చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు.
ప్రతి పిసిఆర్ వ్యానులో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఉంటారు. అవసరమైనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు వీరు కుటుంబ తగాదాల్లో కౌన్సెలింగ్ సలహాలు సూచనలు సైతం ఇస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఢిల్లీ పోలీసులు పోలీస్ కంట్రోల్ రూము వాహనాలను నడుపుతున్నారు. అయితే కేవలం మహిళలే సిబ్బందిగా పనిచేసే పిసీఆర్ వ్యానులు మిగిలిన వాటికంటే భిన్నంగా విధులు నిర్వర్తిస్తున్నాయి. న్యూఢిల్లీలో మహిళల భద్రత, క్షేమాలే ధ్యేయంగా ఇవి పనిచేస్తున్నాయి. మామూలు పిసిఆర్ వ్యానుల్లో ప్రజారక్షణకోసం అవసరమైన వస్తువులు, ఆయుధాలు ఉంటే... మహిళలు పనిచేసే వ్యానులలో వాటితో పాటు... మహిళలకు అవసరమైన శానిటరీ నేప్ కిన్స్ వంటి వస్తువులు కూడా ఉంటాయి.
పిసిఆర్ వ్యానుల్లో విధులు నిర్వర్తించే సబ్ ఇన్ స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ఆయుధాలను వాడటంలోనూ, ఆయుధాలు లేకుండా సమస్యలను ఎదుర్కోవటంలోనూ శిక్షణనిస్తున్నారు. మహిళా పోలీస్ లకు, అధికారులకు ప్రవర్తనా పరమైన జీవన నైపుణ్యాలు, కమ్యునికేషన్ స్కిల్స్, చట్టంపై అవగాహన తదితర అంశాల్లో కూడా శిక్షణనిస్తున్నారు.
పిసిఆర్ వ్యానుల్లో మహిళా పోలీసులు ఉంటే ఆపదల్లో కష్టాల్లో ఉన్న స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకునేందుకు, మనసు విప్పి మాట్లేందుకు సౌకర్యంగా భావిస్తారని, ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా తమ బాధలను బయటపెట్టగలరనే ఉద్దేశ్యంతో ఈ మహిళా పిసిఆర్ వ్యాన్ లను ఏర్పాటు చేశారు.
పీసీఆర్ డిసిపీ మాట్లాడుతూ కంట్రోల్ రూములోని మొబైల్ డాటాని రోజంతా పర్యవేక్షిస్తుంటారని, మహిళల సమస్యలకు సంబంధించిన కాల్స్ వచ్చినప్పుడు పదిహేను వ్యానుల్లో ఆ ప్రదేశానికి ఏది దగ్గర ఉంటే దానికి సమాచారం అందిస్తామని చెప్పారు. గత ఆరునెలల కాలంలో మహిళా పోలీస్ కంట్రోల్ రూము వ్యాన్లకు పదహారు వందల కాల్స్ అంటే సగటున రోజుకి పదినుండి పదిహేను కాల్స్ వచ్చాయి.