Telugu Global
WOMEN

అవయవదాతల్లో ఆడవాళ్లే అధికం

మనదేశంలో జీవించి ఉండగా అవయవదానం చేస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలే ఉంటున్నారు.

అవయవదాతల్లో ఆడవాళ్లే అధికం
X

మనదేశంలో జీవించి ఉండగా అవయవదానం చేస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలే ఉంటున్నారు. అలాగే అవయవమార్పిడి వైద్యం చేయించుకుంటున్న ప్రతి అయిదుగురిలో నలుగురు మగవారు ఉంటున్నారు. అంటే స్త్రీలు అవయవదానాలు చేస్తుంటే మగవారు ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సతో తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. 1995 నుండి 2021 వరకు సేకరించిన గణాంకాల ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సంవత్సరాల మధ్యకాలంలో 36,640 అవయవమార్పిడి చికిత్సలు జరగగా, చికిత్సలు పొందినవారిలో 29,000మంది మగవారు, 6,945మంది మహిళలు ఉన్నారు. కుటుంబంలో మగవారికి ఉన్న ప్రాధాన్యతలు, ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు ఈ తేడాకు కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎక్స్ పెర్మెంటల్ అండ్ క్లినికల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జర్నల్ లో 2021లో ప్రచురితమైన వివరాల ప్రకారం దేశంలో అవయవ మార్పిడి విషయంలో స్త్రీ పురుషుల మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. జీవించి ఉండగా అవయవాలను దానం చేయటం, వాటిని మార్పిడి చేసే వైద్యచికిత్సని పొందటం... ఈ రెండు విషయాల్లో ఆడా మగా సంఖ్య విషయంలో తేడా ఎక్కువస్థాయిలో కనబడుతోంది.

2019లో విశ్లేషించిన గణాంకాల ప్రకారం జీవించి ఉండగా అవయవదానం చేస్తున్నవారిలో 80శాతం మంది స్త్రీలు ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది భార్యలు, తల్లులు. అలాగే అవయవదానంతో ప్రాణాలు నిలుపుకుంటున్న వారిలో 80శాతం మంది మగవారే. ఇందుకు మొదటి కారణం మహిళలపై ఉంటున్న సామాజిక ఆర్థిక ఒత్తిళ్లు. స్త్రీలు కుటుంబానికి సంరక్షకులుగా, కుటుంబం కోసం త్యాగాలు చేసే వారుగా, మగవారు కుటుంబ పోషకులుగా, సంపాదనపరులుగా ఉండటం వలన అవయవదానం చేసేవారు స్త్రీలు, తీసుకునేవారు మగవారై ఉంటున్నారు. అలాగే మగవారు తాము అవయవదానం చేసేందుకు వెనుకాడుతున్నారు.

పుణెకి చెందిన ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేడర్ మయూరి బార్వే ఈ అంశం గురించి మాట్లాడుతూ... ‘నేను పదిహేనుళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. ఇన్నేళ్లలో ఒక్కసారి మాత్రమే భర్త భార్యకు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. సాధారణంగా ఎప్పుడూ తల్లులు, భార్యలు, కొన్నిసార్లు తండ్రులు అవయవదాతలుగా ఉంటారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటే వారే తమ బిడ్డకోసం అవయవదానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. వారికి వీలుకాకపోతే భార్య చేస్తుంది. కొన్నిసందర్భాల్లో వివాహం కాని అక్కా చెల్లెళ్లు సైతం తమ సోదరునికి అవయవదానం చేస్తుంటారు.

ఒకవేళ భార్యకు అవయవ మార్పిడి అవసరం ఉంటే ఆమె వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే. మహిళలకు అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చినా వారు అందుకు అంగీకరించరు. అలా తీసుకోవటంలో వారు చాలా అపరాధ భావనకు గురవుతుంటారు. మన సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లల పెంపకంలో తేడాలు, మగవారే ఎక్కువగా కుటుంబ బాధ్యతలను మోస్తుండటం వలన ఇలా జరుగుతుంటుంది.’ అంటూ అవయవదానం, మార్పిడి అంశాల్లో స్త్రీపురుషుల మధ్య కనబడుతున్న వివక్షని గురించి ఆమె వెల్లడించారు.

First Published:  14 Nov 2023 9:30 AM IST
Next Story