Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    జీతం- జీవితం

    By Telugu GlobalFebruary 11, 20236 Mins Read
    జీతం- జీవితం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    “అమ్మా! అమ్మాయి శ్లోక ఆ ఐ.టీ. కంపెనీ ఉద్యోగంలో చేరాలని మొండిపట్టు పడుతోంది. ఇంకో రెండునెలలలో దాని పెళ్ళి. అమ్మాయి ఉద్యోగం చేయటం కాబోయే అల్లుడు అరవిందలోచన్ కి గానీ, వియ్యంకులకుకానీ అస్సలు ఇష్టం లేదు. అసలు దాన్ని పెళ్ళి చేసుకోడానికి కారణం అది ఉద్యోగం చేయడం లేదనే కదా.

    ‘ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళి, సంపాదించి తెస్తేగానీ, ఇల్లు గడవనంత స్థితిలోలేము వదినగారూ! మా అబ్బాయి ఎమ్.టేక్. చదివాడు. వాడికి సమానంగా చదివిన అమ్మాయైతే, ఇద్దరికీ యెటువంటి కాంప్లెక్స్ ఉండదని, చదువుకున్న అమ్మాయి కావాలని అనుకున్నాం.అంతే.” అని మా వియ్యపురాలు మరీ మరీ చెప్పారు.

    ఆ మాటే నేనంటే, ” నెలకి లక్ష రూపాయల జీతాన్ని యెవరన్నా వదులుకుంటారా అమ్మా? నేను అరవింద్ ని కన్విన్స్ చేస్తాను” అంటోంది శ్లోక. నాకేం చేయాలో తోచడం లేదు. మీ అల్లుడిగారు కూడా యేమీ చేయలేక, చేతులెత్తేశారు దాని వాదనకి.

    ఐనా, “నీవిప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదుకదా కన్నా? ఇప్పుడు నీకేం తక్కువైందని?” అని అడిగాను.

    అంతే! యెంతో ఆవేశపడిపోతూ….

    “ఉద్యోగం చేయడం గురించి నీకేం తెలుసమ్మా? నాన్నగారు ఉద్యోగం చేసి, జీతం తెచ్చియిస్తే, నీవు గ్రాడ్యువేట్, టైపింగ్, షార్ట్ హాండ్ హైయ్యర్ పాసైకూడా, ఉద్యోగం చేయకుండా, వంటింటి కుందేలు లాగా ఇంటికే పరిమితమై పోయావు. నాన్నగారి ఒక్క జీతంతో మనం యెన్ని ఇబ్బందులనెదుర్కున్నామో నీవు మరిచిపోయావేమో కానీ, నేను మరవలేదు.

    ప్రతిసారీ బడికి ఫీస్ ని ఆలస్యంగా, అదీ టీచర్ రిమైండ్ చేశాక కట్టేటప్పుడు, నాకు యెంత అవమానంగా ఉండేదో తెలుసా? తమ్ముడు చిన్నవాడు కనుక, వాడికివేవీ తెలియవు. అలాగే పండగలకి నా స్నేహితులందరూ ఒక నెల ముందుగానే కొన్న మంచి మంచి, ఖరీదైన బట్టలు చూపించేవారు. మాకు మాత్రం రెండు,మూడు రోజులకు ముందు మామూలు బట్టలు కొనిపెట్టేదానివి. అవి మా స్నేహితులకి చూపడానికి యెంత సిగ్గుగా ఉండేదో తెలుసా?

    అలాగే బళ్ళో విహారయాత్రలకి వెళ్ళాలంటే, దగ్గరగా ఉండే చోట్లకి మాత్రమే పంపేదానివి తక్కువ ఖర్చు అవుతుందని. ఆ డొక్కు బ్లాక్ & వైట్ టి.వీ.లో 10 యేళ్ళు పిక్చర్ ట్యూబ్ పూర్తిగా చెడిపోయే దాకా దాన్లోనే కార్యక్రమాలన్నీ చూసేవారం. కొన్నిసార్లు పిక్చరు రాక, రేడియోలాగా వినేవాళ్ళం. మళ్ళీ కొత్త టి.వీ కొనేదాకా మేము మాకు నచ్చిన కార్యక్రమాలని పక్కింట్లోనో, లేక స్నేహితుల ఇళ్ళలో చూసేవాళ్ళం. మా స్నేహితులుగానీ, వారి తలిదండ్రులు కానీ యేమీ అనేవారు కాదు. కానీ, వాళ్ళ ఇళ్ళల్లో యెవరైన చుట్టాలొస్తే, వాళ్ళు ఒక్కొక్కసారి మావైపు ఒకలాగా చూసేవారు. అది ఇప్పుడు తలుచుకున్నా, నాకు బాధేస్తుంది. ఇలాంటివి ఎన్నెన్నో.

    అదే నీవు ఉద్యోగానికి వెళ్ళియుంటే యెంత బాగుండేది? చక్కగా మేము కూడా తక్కినవారిలాగా ఫీజులన్నీ సమయానికి కట్టేసి, టీచర్లు, తోటి స్నేహితుల దగ్గర తలెత్తుకుని గొప్పగా తిరిగేవాళ్ళం కదా. వారానికి ఒకసారి బయట హోటల్ లో తినేవాళ్ళం, నెలకోసారి సినిమాకి, రెండునెలలకి ఒకసారి యెక్కడికైనా విహారయాత్ర,అలాగే వేసవి శెలవులలో ఢిల్లీ, కలకత్తా అని వేరే ఊర్లకి తిరిగేవాళ్ళం కదా అమ్మా! ఇలా అద్దెఇంట్లో కాక, మనకు నచ్చిన చక్కని ఒక ఇంట్లోనో లేక ఫ్లాట్ లోనో ఉండేవాళ్ళం. నేను ఎమ్.టెక్. కాకుండా ఎమ్.బి.బి.ఎస్. చదివేదాన్ని డొనేషన్ కట్టి. తమ్ముడు బి.కాం. తో ఆపకుండా, సీ.ఏ. చేసేవాడు. నీవు ఉద్యోగం చేయకపోవడం వల్ల మేమిద్దరం యెంత కోల్పోయామో ఇప్పటికి అర్థం అయిందనుకుంటా ను.” అని ఒక పెద్ద లెక్చర్ ఇచ్చింది.

    నేను, మీ అల్లుడు కాస్సేపటిదాకా అదిచ్చిన షాక్ నుంచి తేరుకోలేదు. తర్వాత అమ్మాయే కాస్త టీ చేసి, మా చేతుల్లో పెట్టి ఈ లోకానికి రప్పించింది. అది ఉద్యోగంలో చేరితే ఈ పెళ్ళి జరగదు. అంత మంచి సంబంధం వదులుకోవడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. నాకేం చేయాలో తెలియడం లేదు. నేను అమ్మాయిని అక్కడికి పంపిస్తున్నాను. ఇక నీదే భారం”

    అంటూ కూతురు శ్రీజ మొబైల్ లో తనకు పెట్టిన సుదీర్ఘ సందేశాన్ని చదివిన అనంతలక్ష్మి పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది.

    “ తప్పకుండా అమ్మాయిని పంపు. అన్నీ సవ్యంగా జరుగుతాయి. దిగులుపడకు. ఎప్పుడొస్తోందో ముందే తెలుపు” అని సమాధానం పంపింది. “రేపే పంపుతాను” అని శ్రీజ సమాధానమిచ్చింది.

    అమ్మమ్మని దగ్గరుండి పెళ్ళికి పిలుచుకురమ్మని చెప్పి, మరుసటి రోజే తల్లి ఊరికి కూతురిని పంపింది శ్రీజ. అమ్మమ్మంటే చిన్నప్పటినుండి ఇష్టం, చేరిక ఉండడం వలన, వెంటనే బయలుదేరింది శ్లోక. అమ్మ, నాన్నలు అమ్మమ్మ చెప్పిన మాటలని తు.చ. తప్పకుండా వింటారు కనుక, అమ్మమ్మద్వారా తన సమస్య ఒక కొలిక్కి వస్తుందని శ్లోక రెట్టింపు ఉత్సాహంతో అమ్మమ్మ ఊరు చేరింది.

    ————

    శ్లోక వస్తోందని అనంతలక్ష్మి చక్కటి వంటలు చేసింది. స్టేషన్ కి స్వయంగా ఆటోలో వచ్చింది మనవరాలిని పిలుచుకు వెళ్ళడానికి. అమ్మమ్మ ఆప్యాయతకి మురిసిపోయింది శ్లోక. ప్రేమతో అమ్మమ్మని వాటేసుకుంది. మనవరాలి ప్రేమకి అమ్మమ్మ మనసు కరిగిపోయింది వెన్నలాగా.

    ఊరికి వచ్చినప్పటినుండి మాటలమూటల ముళ్ళు విప్పసాగింది శ్లోక. మనవరాలు చెప్పే అన్ని విషయాలని ఆసక్తిగా వింటూ, మధ్య మధ్య ప్రశ్నలడుగుతూ, మీగడతో ఉన్నవేడిపాలని అందించింది అనంతలక్ష్మి. తనకు యెంతో ఇష్టమైన పాలని ఇష్టంగా తాగింది. తరువాత స్నానం చేసి వచ్చింది శ్లోక. వంటింటి ముందే ఉన్న వసారాలో చక్కగా శుభ్రం చేసిన అరిటాకు, దాని ప్రక్కన ఒక మంచి నీళ్ళ గ్లాసు పెట్టి ఉన్నాయి. శ్లోక వచ్చి కూర్చుని, “ అమ్మమ్మా! నీవు కూడా నాతో కూర్చో. ఇద్దరం కలిసి భోంచేద్దాం.” “సరే” అంటూ తనకు కూడా అరిటాకు వేసుకుంది అమ్మమ్మ. రెండు ఆకుల్లోనూ కొన్ని నిమిషాలదాకా వరసగా వడ్డించిన దాదాపు 10 రకాల అధరువులను చూసి, ఆశ్చర్యపోయింది శ్లోక.

    “అమ్మమ్మా! ఇన్ని రకాల వంటలా? నువ్వే చేశావా లేక వేరెవరైనా చేసి పంపారా?” అని అడిగింది.

    “ఎవరో యెందుకు చేస్తారు రా? అన్నీ నేనే స్వయంగా చేశా. గుమ్మడికాయ వడియాలు, అరటికాయ చిప్స్, గోంగూర పచ్చడి, ఆవకాయ, మాగాయ, మజ్జిగ మిరపకాయలు, ఆకుకూర, మామిడికాయ పప్పు, నువ్వుల, ఉసిరికాయ లడ్డు…ఇంకా…” అంటూ పరిచయం చేస్తూండగానే …….

    ఆమె మాటలకి అడ్డువస్తూ, “ అమ్మమ్మా! ఎందుకమ్మా శ్రమపడ్డావు? నేనేం చుట్టాన్ని కాను కదా? సింపిల్ గా పప్పు చారు, కూర, పెరుగు ఉంటే చాలుకదా? ఏవైనా కావాలంటే హోటల్ నుంచి కొని తెస్తే సరి” అని నొచ్చుకుంది.

    “ఇందులో శ్రమ యేముందమ్మా? మన వాళ్ళకి మనచేతులారా చేసిపెడితే కలిగే తృప్తి వర్ణించలేం కదా. హోటల్ తిళ్ళు అనారోగ్యం, ప్రియం కూడా. చాలాసార్లు వాడేసిన నూనెలలో వండిన పదార్థాలు త్వరగా జీర్ణం కావు సరికదా, పోషకవిలువలు కూడా ఉండవు. వాళ్ళు యేమేం కలుపుతారో, యెలాంటి చేతులతో చేస్తారో, యెలాంటి భావాలతో చేస్తారో తెలియదుకదా? అదీ కాక వాళ్ళు వ్యాపారం కోసం, అధిక మోతాదులో చేస్తారు కనుక వస్తువులలో నాణ్యత గురించి పట్టించుకోకుండా, అందరికీ త్వరగా అందించాలన్న తొందరతో చేస్తారు. కొన్ని సార్లు అవి సరిగ్గా ఉడకవు కూడా. వేడిగా ఉండడం వల్ల, మాట్లాడుతూ తినడం వల్ల మనం దానిని పట్టించుకోం. అదే మనం ఇంట్లో చేస్తే మనం వాడే వస్తువులు మనకు తెలుసు. మంచి వస్తువులను ఎంపిక చేసుకుని, మనవాళ్ళకోసమన్న భావనతో ఇష్టంతో చేస్తాం. ఆ చేసే పదార్థం కూడా బాగా యేకాగ్రతతో చేస్తాం కాబట్టి బాగా కుదురుతుంది.”

    అన్నీ విన్న శ్లోక “ అమ్మమ్మా!అన్నీ సరే కానీ, భావమని యేదో అన్నావే, దాని అర్థం యేంటి అమ్మమ్మా”

    “ యద్భావం తద్భవతి – అంటే మన మనసులో యే భావమైతే ఉందో మనం చేసేది అలా ఉంటుందన్నమాట. అంటే వేరే యేదో పని ఉందనో, బయటికి వెళ్ళాలనే ఆలోచనతో వంట చేయడం, యెవరిమీదైనా కోపంగా ఉన్నపుడో, మనసు బాగాలేనపుడో వంట చేస్తే, వంటంతా పాడవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ప్రశాంతతతో చేయాలి, కావాలంటే చక్కటి పాటలు కూడా పాడుకోవచ్చు. అర్థమైందా?”

    “ అలాగా అమ్మమ్మా? భలే భలే.” అంటూ, “ అమ్మమ్మా! నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అమ్మా, నాన్న, అరవింద్ వాళ్ళకి ఇష్టం లేదు. కాస్త నాకు సాయం చేయవూ? నెలకి లక్షరూపాయలంటే ఎంత ఆదా చేయొచ్చు, ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, ఎంత ఆడంబరంగా ఉండొచ్చు? నీవే చెప్పు అమ్మమ్మా” అని గారాబంగా అడిగింది.

    “జీతం బాగా ఉంటే జీవితం బాగా ఉండాలని లేదే పిల్లా. మనిషికి ముఖ్యంగా ఉండవలసినది తృపి. మన యెదురింటి ప్రత్యూష తెలుసు కదా?”

    “ తెలుసు. ఐ.బి.ఎమ్. లో పని చేస్తోంది కదా? తనకి రెండేళ్ళ క్రితమే లక్ష రూపాయలట కదా జీతం? ఇప్పుడు ప్రమోషన్ వచ్చి, జీతం 2 లక్షలైందని విన్నాను. చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడెలా ఉంది?”

    “ అవును. అదృష్టవంతురాలనే నేనూ మొదట అనుకున్నాను.

    కానీ అది సరి కాదని తరవాత తెలిసింది.”

    “అరే! అది యెలా?” అనిఅడిగింది శ్లోక.

    “ తన ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం 20 కి.మీ. అంటే సుమారు 45 నిమిషాల దూరమన్నమాట. కనుక 9 గంటల ఆఫీసుకి 8 గంటలలోపు బయలుదేరాల్సివచ్చేది. బస్సులో ఐతే ఆలస్యమౌతుందని, వెళ్ళడానికి, రావడానికి క్యాబ్ యేర్పాటు చేసుకుంది. మొదట కొన్నిరోజులు ఉదయమే 4 గంటలకి లేచి, అల్పాహారం, వంట అంతా ముగించి, ఆఫీసుకి బయల్దేరేది. అంతప్రొద్దునే ట్రాఫిక్ అంతగా ఉండదు కనుక ఆఫీసుకి 9 లోపే వెళ్ళి చేరిపోయేది. కానీ సాయంత్రం మాత్రం ఆఫీసు 6 గంటలదాకా ఐనా, ట్రాఫిక్ వలన ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 9 అయ్యేది. ఒక్కొక్కసారి ఇంకా ఆలస్యమయ్యేది. వచ్చీరావడంతోనే మళ్ళీ వంటచేయడం, వంటిల్లు సర్దడం లాంటి పనులతో చాలా ఇబ్బందైపోయేది. కనుక కొన్నాళ్ళు ప్రక్కనే ఉన్న మెస్ లోంచి టిఫినో, అధరువులో ఇంటికే తెచ్చి, ఇచ్చేట్లు యేర్పాటు చేసుకుంది. ఆ రుచులు పడక, అజీర్తి చేయడంతో అదీ మానేసేయాల్సి వచ్చింది. కనుక తెలిసినవాళ్ళ మూలంగా ఒక వంటమనిషిని యేర్పాటు చేసింది.

    ఇక పిల్లవాడు పసివాడు కావడంతో అత్తగారికి వాడిని చూసుకోవడం కాస్త ఇబ్బందైంది. ప్రత్యుష ఇంటికి వచ్చేలోపల పిల్లవాడు తల్లిపై బెంగతో, ఆకలని చెప్పుకోలేక, యేడ్చి, యేడ్చి నిద్రపోయేవాడు. అత్తగారి అనారోగ్యకారణంగా పిల్లవాడి ఆలనా, పాలనా కరువై, బక్క, చిక్కి పోసాగాడు. అందుకని పిల్లవాడిని చూసుకోడానికి ఒక తెలిసిన మనిషిని యేర్పాటు చేసింది. ఆమెకి మాలిమి అయ్యేదాక ఒక వారం రోజుల పాటు ఇంటినుండే పనిచేయడానికి ఆఫీసునుండి అనుమతి తీసుకుంది. కాబట్టి జీతం లక్షే ఐనా, అందులో అద్దెకి, వంటమనిషికి, పనిమనిషికి , అత్తమామలు చూసుకోలేరని పసిపిల్లవాడిని చూసుకునే మనిషికి జీతాలు, పనిచేసే ఆఫీసు దూరం కనుక వెళ్ళి, రావడానికి కారుకి ఖర్చు, ఇక ఆఫీసరు కనుక బీరువానిండా ఖరీదైన దుస్తులు, ఇంట్లో బజారులో క్రొత్తగా వచ్చే అన్ని ఉపకరణాలు, తను ఇంట్లో లేని కొరతని తీర్చడానికి పిల్లవాడికి ఖరీదైన ఆటబొమ్మలు, బజారు చిరుతిళ్ళు వగైరా, వగైరా పోగా నెల చివరికి మిగిలింది 25000/-. ఆఫీసులో టార్గెట్ అన్న టార్చర్ తో యెక్కువసేపు పనిచేయడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అశాంతి, నరాల బలహీనత. వైద్యుని సలహా మేరకు రాజీనామాచేసి, ఆరోగ్యం కొరకు యోగా క్లాసులలో చేరింది. ఇప్పుడు హాయిగా, ఆరోగ్యంగా తిరుగుతోంది. కొడుకు బాల్యాన్ని ఆస్వాదిస్తూ, వాడికి తన అనురాగాన్నిఅందిస్తూ, భర్తా, అత్తమామలకి సమయానికి అన్నీ సమకూరుస్తూ తృప్తిగా జీవిస్తోంది. ఆ!అన్నట్లు మరిచాను చదివిన చదువు వృథా కాకుండా చుట్టుప్రక్కల పిల్లలకి ట్యూషన్లు చెబుతోంది ఇంట్లోనే ఉంటూ. ” అన్న అమ్మమ్మ మాటలని విన్న శ్లోక మనసుకి పట్టిన ఉద్యోగపు మబ్బు మెల్లగా చెదిరిపోసాగింది.

     – డా. తిరుమల ఆముక్తమాల్యద,

    (చెన్నై)

    Dr Tirumala Amuktamalyada Telugu Kathalu
    Previous Articleకలికి తురాయి (చిట్టి కవిత)
    Next Article హిండెన్ బర్గ్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్న అదానీ!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.