ఈనెల 15నుంచి జగన్ ప్రజా దర్బార్ మొదలు పెడుతున్నారంటూ మీడియాలో లీకులొచ్చాయి. ప్రత్యేకించి టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే ఈ వార్తలు రావడం విశేషం. జగన్ గురించి ఏ అప్ డేట్ ఉన్నా ముందుగా సాక్షిలో వార్తలొచ్చేవి, కానీ ప్రజా దర్బార్ గురించి మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలివ్వడం విశేషం. అందులోనూ ప్రజా దర్బార్ గురించి నెగెటివ్ ప్రచారానికి వారు తెరతీశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రజల్ని కలవలేదని, అందుకే ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారంటూ విమర్శనాత్మక కథనాలిచ్చారు.
జగన్ అంటేనే జనం..
ప్రజా దర్బార్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసలు జగన్ కి ప్రజలకు మధ్య దూరం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పెట్టాల్సిన అవసరం లేదని, ఆయన నిత్యం ప్రజలతోనే ఉంటున్నారని కొన్ని ఫొటోల్ని ప్రదర్శించారు. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అని వివరించారు అంబటి. ఆయనపై తప్పుడు రాతలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
గతంలో, ఇప్పుడు, ఇక ముందు.. జగన్ ఎప్పుడూ జనంతోనే ఉన్నారని అన్నారు అంబటి రాంబాబు. ప్రజా దర్బార్ పెట్టాల్సిన ప్రత్యేక అవసరం ఆయనకు లేదని, ఆయన నిత్యం ప్రజల్ని కలుస్తూనే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అధికారిక బాధ్యతలు లేవు కాబట్టి, మరింత ఎక్కువమందిని ఆయన కలిసే అవకాశముందన్నారు. చంద్రబాబు తన జీవితంలో ఎంతమంది ప్రజల్ని కలిశారో, అంతకు 10రెట్లు ఎక్కువ మందిని జగన్ ఇప్పటికే కలిసి ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి.