ఫెంగల్ తుఫాను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌నూ వణికిస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రానికి తుపాను కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫురు తీరం దాటే సమయంలో గంటకు 90 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, అనంతరంపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, కర్నూల్, వెస్ట్ గోదావరి, కాకినాడ, అనాకపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. సముద్రం తీరం వెంట గంటకు 50 కి.మీ.ల నుంచి 60 కి.మీ.ల వరకు, ఒక్కోసారి 70 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కృష్ణపట్నం ఓడరేవు వద్ద ఆరో నంబర్ డేంజర్ సింగ్నల్, మిగిలిన ఓడరేవుల వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఫెంగల్ తుఫాను గంటకు 13 కి.మీ.ల వేగంతో పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతోందని, పుదుచ్చేరికి 120 కి.మీ.ల దూరంలో, చెన్నైకి 110 కి.మీ.ల దూరంలో, నాగపట్నానికి 200 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Previous Articleతెలంగాణలో ‘పుష్ప 2’ సినిమా టికెట్ ధరల పెంపు
Next Article ఎన్డీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
Keep Reading
Add A Comment