ఆ రెండు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచే
చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్ రైళ్లు నడిచేది అక్కడి నుంచే
చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. దీంతో ఆ స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ల నుంచి నడుస్తున్న రెండు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచే మొదలు కానున్నాయి. అయితే ఇది ఇప్పటికిప్పుడే కాదు.. దానికి కొంత టైం ఉంది. మార్చి 12వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే రైలు (12603/12604), సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్ కు వెళ్లే రైలు (12589/12590) సరిగ్గా మూడు నెలల తర్వాత చర్లపల్లి నుంచే ప్రారంభమవుతాయి. అంతేకాదు రిటర్న్ జర్నీలో వాటి ఫైనల్ డెస్టినేషన్ కూడా చర్లపల్లి స్టేషనే. మంగళవారం నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అప్ అండ్ డౌన్ లో చర్లపల్లిలో ఆగుతాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే నడిపిస్తున్న 52 ప్రత్యేక రైళ్లలో కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నారు. మరికొన్ని రైళ్లకు చర్లపల్లి స్టేషన్‌లో హాల్టింగ్ ఇచ్చారు.