Telugu Global
Travel

ఈ గ్రామాలను ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు!

మనదేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్‌లు మరే దేశంలోనూ లేవు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది మన గ్రామాలను విజిట్ చేస్తున్నారు.

ఈ గ్రామాలను ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు!
X

టూర్ అనగానే అందరూ గోవా, ఊటీ, షిమ్లా లాంటి పాపులర్ ప్లేసులకి పరుగులు పెడతారు. కానీ, నిజమైన భారతదేశాన్ని చూడాలంటే మారుమూల పల్లెలకు వెళ్లాలి. దీన్నే ‘రూరల్ టూరిజం’ అంటారు. ఇప్పుడిప్పుడే ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతోంది. చాలామంది విదేశీ టూరిస్టులు మనదేశంలోని పల్లెలను సందర్శిస్తూ.. మన దేశపు కల్చర్‌‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.

పల్లెల్లోని ప్రకృతి అందాల్ని, అక్కడి కళలు, సంస్కృతి, ఆచారాలు తెలుసుకోవటం కోసం ప్రభుత్వం ‘రూరల్ టూరిజం’ను ప్రమోట్ చేస్తుంది. మనదేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్‌లు మరే దేశంలోనూ లేవు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది మన గ్రామాలను విజిట్ చేస్తున్నారు. సిటీ లైఫ్‌కి కొన్ని రోజులు ‘బై’ చెప్పి, పల్లె వాతావరణంలో సేద తీరాలంటే... కొన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్స్‌కు వెళ్లాల్సందే. అవేంటంటే.

హర్షిల్

ఉత్తరాఖండ్‌లో ఉండే హర్షిల్ గ్రామం భాగీరథి నది ఒడ్డున ఉంటుంది. హిమాలయాల్లోని బాపాసా లోయలో ఈ విలేజ్ ఉంటుంది. చుట్టూ హిమాలయాలు, దూరంగా ఎత్తైన పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి దగ్గరలోనే మాత్రి, కేదార్‌నాథ్ ఉన్నాయ్. ఈ ప్రాంతమంతా నేచురల్‌గా పెరిగిన యాపిల్ తోటలు, నదీ ప్రవాహాలు, జలపాతాలు, పర్వతాలతో నీట్‌గా డిజైన్ చేసినట్టు ఉంటుంది.

అనెగుండి

కర్ణాటకలోని ఈ గ్రామం రామాయణం కాలం నాటిదని చెప్తారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని అనెగుండిని ‘కోతుల రాజ్యం’ లేదా ‘కిష్కింద’ అని పిలుస్తారు. ఇది కర్ణాటకలోని ఫేమస్ హెరిటేజ్ సైట్ హంపి కంటే పాతది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో ఎన్నో కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ ఊరు చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే చరిత్ర గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు ఆతిధ్యం కూడా బాగుంటుంది.

పుత్తూరు

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న గ్రామం పట్టు వ్యాపారానికి ఫేమస్. ఈ గ్రామంలో వ్యవసాయం, పట్టు వ్యాపారం ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గ్రామం చుట్టు పక్కల ఉండే మడ అడవులు, అక్కడి సాంప్రదాయ పాత ఇళ్లు ఎంతో అందంగా ఉంటాయి. కొత్తగా అక్కడికి వెళ్లిన వాళ్లకు కొత్త అనుభూతినిస్తాయి. అందమైన గ్రామం, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ఇక్కడ కనిపిస్తుంది. ఆతిధ్యం కూడా బాగుంటుంది. చేనేత కార్మికుల జీవన విధానం, పట్టు చీరల తయారీని చూడాలంటే.. పుత్తూరికి వెళ్లాల్సిందే.

చిత్రకోట్

ఛత్తీస్‌గడ్‌లోని చిత్రకోట్ గిరిజన సంప్రదాయానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండేవాళ్లు జనావాసానికి దూరంగా, అడవిలో గిరిజన సంప్రదాయాలతో జీవిస్తారు. చిత్రకోట్ గ్రామంలో ఉండే జానపద కళలు, హస్తకళలు చాలా ఫేమస్. అడవుల్లో జలపాతాల మధ్య ఉండే చిత్రకూట్ టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడకి వెళ్తే దగ్గర్లో జగదల్పూర్ ప్యాలెస్, దంతేశ్వరి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

హోడ్కా

గుజరాత్ కచ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం చాలా అందమైన ప్రాంతం. కచ్ జిల్లా అంతా తెల్లటి ఎడారితో నిండి ఉంటుంది. చూడడానికి చాలా కొత్తగా అందంగా అనిపిస్తుంది. ఇక్కడి ఎన్విరాన్‌మెంట్ కూడా కాలాలను బట్టి రంగులు మార్చుకుంటుంది. చలికాలం లో ఇక్కడకు వందకు పైగా పక్షి జాతులు వలసకు వస్తాయి. ప్రతి ఏటా చలికాలంలో ఇక్కడ ‘రన్ ఉత్సవ్’ జరుగుతుంది.

శ్యాంగావ్

అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఉన్న చిన్న బౌద్ధ ప్రాంతం శ్యాం గావ్. ఈ గ్రామం అస్సాం గ్రామీణ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అస్సాం కల్చర్ మిగతా కల్చర్స్ కంటే భిన్నంగా, కొత్తగా ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో సంస్కృతి , సంప్రదాయాలు ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. శ్యాం గావ్ ఒక ప్రాచీన గిరిజన గ్రామం. ఇక్కడ ఉండే గిరిజనులు థేరావాడ బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఈ ప్రాంతం అడవుల్లో ఎంతో అందంగా, ప్రశాంత౦గా ఉంటుంది.

కుంబలంగి

కుంబలంగి కేరళ బ్యాక్ వాటర్స్‌లో ఉన్న ఒక చిన్న ఐల్యాండ్‌లోని గ్రామం. ఇక్కడ జనావాసం చాలాతక్కువ. పూర్తిగా ప్రకృతి తో కప్పబడిన ఈ ప్రాంతం విదేశీ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది. కేరళకు వచ్చే టూరిస్టుల్లో చాలామంది కుంబలంగికి కూడా వస్తుంటారు. ఈ చిన్న గ్రామంలో స్టే చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయ్. బ్యాక్ వాటర్స్‌పై బోట్ స్టే చేయడం. బోట్‌లో షికారుకెళ్ళడం ఇక్కడ వాళ్లకు ఓ హాబీ. ఇక్కడ నివసించే వాళ్లంతా కళాకారులే. కేరళలోని సాంప్రదాయ కలల్లో నైపుణ్యం ఉన్నవాళ్లు. ఇక్కడకు వచ్చే విదేశీ టూరిస్టులకు ఇక్కడి నృత్యాలు, కళలు, వంటలు నేర్పిస్తూ ఉంటారు.

మన దగ్గర కూడా...

తెలంగాణలో కూడా రూరల్ టూరిస్ట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయ్. శ్రీశైలం నల్లమల అడవుల్లోని మన్ననూరు, అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాలు ఇక్కడి కల్చర్‌‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అవే కాకుండా గోదావరి ఒడ్డున ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, జంపన్నవాగు.. లాంటి ప్రాంతాలు కల్చర్‌‌తో పాటు, పల్లె అందాలను, పచ్చటి వాతావరణాన్ని అందిస్తాయి.

First Published:  17 Jan 2024 12:10 PM GMT
Next Story