చైనాలో కొత్త బుల్లెట్ ట్రైన్
గంటకు 450 కి.మీ.ల స్పీడ్
చైనాలో కొత్త బుల్లెట్ ట్రైన్ పట్టాలపైకి దూసుకొచ్చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 450 కి.మీ.ల మెరుపు వేగంతో ప్రయాణిస్తుంది. సీఆర్ 450 అనే ఈ బుల్లెట్ ట్రైన్ ను బీజింగ్ లో ఆదివారం పరీక్షించారు. గంటకు 400 కి.మీ.ల స్పీడ్ తో ఈ రైలు ప్రయాణించింది. ఈ ట్రైన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంతో ప్రయాణించేదిగా నిలుస్తుందని చైనా అధికారులు వెల్లడించారు. బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ఈ రైలు చేరుకుంటుందని చెప్పారు. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 45 వేల కి.మీ.ల పొడవైన మెట్రోరైల్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బ్రిడ్జిలు, టన్నెళ్లతో కూడిన అధునాతన ట్రాక్ లు నిర్మించారు. సీఆర్ 400 మోడల్ కన్నా సీఆర్ 450 రైలు బాడీ బరువు 12 శాతం తక్కువగా ఉంటుందని.. అంటే 10 టన్నులు మాత్రమే ఉంటుందని చైనా అధికారులు తెలిపారు. కరెంట్ వినియోగం కూడా సీఆర్ 400తో పోల్చితే 20 శాతం తక్కువని చెప్పారు. ఇంజిన్ టెస్టింగ్ సీఆర్ 450 ట్రైన్ అత్యధికంగా 453 కి.మీ. వేగాన్ని అందుకుందని తెలిపారు.