Telugu Global
Travel

వర్షాల టైంలో విజిట్ చేయాల్సిన బీచ్ లు!

మనదేశంలో బీచ్‌లకు కొదవే లేదు. కోల్‌కతా నుంచి ముంబై వరకు తీరం అంతటా బీచ్‌లే. కానీ అన్ని బీచ్‌లు ఒకేలా ఉండవు. ఒక్కో బీచ్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.

వర్షాల టైంలో విజిట్ చేయాల్సిన బీచ్ లు!
X

వర్షం అంటే చాలామందికి ఇష్టం. అలాగని వర్షంలో తడవడానికి వెనుకాడుతుంటారు. వర్షాన్ని మరింత బెటర్‌‌గా ఆస్వాదించాలంటే.. వర్షాలు పడే వేళ సరైన డెస్టినేషన్ లో ఉండాలి. ముఖ్యంగా వర్షాల్లో విజిట్ చేయాల్సిన బీచ్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలో బీచ్‌లకు కొదవే లేదు. కోల్‌కతా నుంచి ముంబై వరకు తీరం అంతటా బీచ్‌లే. కానీ అన్ని బీచ్‌లు ఒకేలా ఉండవు. ఒక్కో బీచ్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ మాన్‌సూన్‌లో కొన్ని బీచ్‌లు మనల్ని వర్షంతో తడుపుతూ ఆహ్వానం పలుకుతాయి.. అలాంటి బీచ్‌లే ఇవి.

వర్కలా బీచ్

ఇది కేరళలోని తిరువనంత పురంలో ఉంది. వర్కలా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆగస్టు నెలలో ఇక్కడ సాయంత్రాలు చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్లడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఈ బీచ్లో సన్ బాత్, స్విమ్మింగ్ లాంటివి కూడా చేయొచ్చు. వర్కాలాలో ఫుడ్ అండ్ అకామిడేషన్‌కు ఎలాంటి లోటు ఉండదు. హోటల్స్, రిసార్ట్స్ చాలానే ఉంటాయి.

మరావంతే బీచ్

ఈ బీచ్ కర్ణాటకలోని కొల్లూరు , కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఉడుపి టౌన్ ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం. ఈ బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉంటుంది. ఈ బీచ్ కిలోమీటర్ల పొడవునా ఏ మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో దుప్పటి కప్పినట్టు ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఇది కూడా మంచి బీచ్. ఇక్కడికి దగ్గర్లో కంచుగోడు విలేజ్ దగ్గర స్కూబా డైవింగ్, స్నోర్‌‌కెలింగ్ లాంటి అడ్వెంచర్స్ చేయొచ్చు.

సెయింట్ మేరీస్ ఐల్యాండ్

సెయింట్ మేరీస్ ఐల్యాండ్ కర్నాటకలోని మాల్పే తీరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఐల్యాండ్‌ను ‘కోకోనట్ ఐల్యాండ్‌’, ‘తాన్సేపార్ ఐల్యాండ్‌’ అని కూడా అంటారు. ఇవి మొత్తం నాలుగు ఐల్యాండ్స్. కర్నాటకలోని ఉడిపికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ సముద్రంలో ఉండే రాళ్ల వల్ల అలల శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ఇంకా ఈ ఐల్యాండ్ చుట్టూ ఉన్న కొబ్బరి తోటలు ఎంతో అందంగా ఉంటాయి. నెలవంక ఆకారంలో ఉండే బీచ్‌, చుట్టూ పొడవైన కొబ్బరి తోటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.

ప్రొమెనేడ్ బీచ్

ప్రొమెనేడ్ బీచ్ తమిళనాడులో ఉంది. ప్రశాంత వాతావరణంలో గడపడానికి ప్రొమెనేడ్ బీచ్ బెస్ట్ ప్లేస్. ఈ బీచ్ మార్నింగ్, ఈవినింగ్ వాక్స్‌కు ఫేమస్. రోజూ ఎంతోమంది ఈ బీచ్‌లో వాకింగ్ చేస్తూ కనిపిస్తారు. చిరుజల్లులు కురుస్తుంటే.. సముద్ర తీరంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలి నడకన నడుస్తూ ఉంటే మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. ఈ బీచ్ పాండిచ్చేరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్‌కు వెళ్లేదారిలో వార్ మెమోరియల్, డూప్లెక్స్ పార్క్‌లు కూడా చూడొచ్చు.

రాధానగర్ బీచ్

రాధానగర్ బీచ్ అండమాన్ దీవుల్లో ఉంది. ఇది ఇండియాలోనే కాదు ఆసియాలోనే బెస్ట్ బీచెస్ లో ఒకటి. ఈ బీచ్‌ను ‘సెవెన్ బీచ్’ అని కూడా పిలుస్తారు. ఇది అండమాన్‌లోని హ్యావ్లాక్ ఐల్యాండ్‌లో ఉంది. ఈ బీచ్‌లో ఇసుక తెల్లగా మెరుస్తూ ఉంటుంది. వాటర్ గ్రీన్, బ్లూ కలర్స్‌లో కనిపిస్తాయి. మాన్‌సూన్ సీజన్‌లో ఇక్కడ కురిసే చిరు జుల్లుల కోసం ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఈ బీచ్‌లో ప్యారాసైలింగ్, స్నోర్‌‌కెలింగ్, వైండ్ సర్ఫింగ్ వంటి స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే లోకల్ సీఫుడ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

First Published:  21 Jun 2024 12:30 AM GMT
Next Story