Telugu Global
Telangana

కాంగ్రెస్‌ పాలనలో అధ్వనంగా సంక్షేమ హాస్టళ్లు

తమ బిడ్డలు బతికుంటే చాలు అన్నట్టుగా తల్లిదండ్రుల పరిస్థితి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ పాలనలో అధ్వనంగా సంక్షేమ హాస్టళ్లు
X

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అధ్వనంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చదువు సంగతి దేవుడెరుగు తమ పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలు అన్నట్టుగా తల్లిదండ్రుల పరిస్థితి మారిందని 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. హాస్టళ్లలో బువ్వ మాకొద్దు.. అక్కడ తాముండలేమని విద్యార్థులు వేడుకుంటున్నారని తెలిపారు. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ లోని కేజీబీవీ నుంచి తమను తీసుకెళ్లాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులను వేడుకుంటున్న వార్తలు కలచి వేశాయని తెలిపారు. అనంతపేట్‌ కేజీబీవీలో విషాహారం తిని పది మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని, వాంకిడి గురుకులంలో విషాహారం తిని విద్యార్థి శైలజ 21 రోజుల పాటు నిమ్స్‌ లో చికిత్స పొంది కన్నూమూశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్యూ కట్టేవారని.. ఇప్పుడు గురుకులాలు, హాస్టళ్లలో తాము ఉండలేమని విద్యార్థులు వేడుకునేంతగా పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భావి పౌరుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. ఆయన చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ప్రాణాలు కాపాడే చర్యలు చేపట్టాలన్నారు.

First Published:  29 Dec 2024 12:39 PM IST
Next Story