ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పనిచేయండి
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల
అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వివిధ అంశాలపై మంత్రి చర్చించారు.
రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పరిష్కారంలో జాప్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనాలు అందేలా వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింత ప్రోత్సాహం అందించాలన్నారు. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్లి అమ్మేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లు అధునాతన హంగులతో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్సిటీల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల వృద్ధి, కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.