'పాలమూరు' ఎత్తిపోతలను ఎందుకు పక్కన పెట్టారు
రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తయ్యే అవకాశమున్నా పట్టించుకోవడం లేదు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.34 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలను నిర్మించామని.. ఇంకో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయని ఏడాదిగా మొత్తుకుంటున్నా పనులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ఉన్న శ్రద్ధ పనులు ప్రారంభించడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడులను తలదన్నే ప్రాజెక్టును బీఆర్‌ఎస్ చేపట్టిందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా పాలమూరు నుంచి ఎకరానికి నీళ్లివ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టులు చేపడితే వాటిపై కేసులు వేసు అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మిగులు జలాలతో ప్రాజెక్టులు చేపడుతున్నామని చంద్రబాబు చెప్తుంటే రేవంత్ రెడ్డి దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేనద్నారు. కేసీఆర్ పై ఎంత దుష్ప్రచారం చేసినా వాస్తవాలేమిటో ప్రజలకు తెలుసన్నారు.