Telugu Global
Telangana

పేదల ఆస్తులకు రక్షణ ఏది రేవంత్?

హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డ ఎంపీ ఈటల

పేదల ఆస్తులకు రక్షణ ఏది రేవంత్?
X

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో అలజడి సృష్టిస్తున్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. మూడు నెలలు హడావుడి చేసి ఇప్పుడు పేదల ఇళ్లపై పడ్డారని ఆరోపించారు. కబ్జాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 25 మంది గూండాలు నిత్యం హడావుడి చేస్తున్నారని విమర్శించారు. 40-50 ఏండ్ల కిందట నాటి ప్రభుత్వాలు చెరువుల పక్కన ఇళ్లు కట్టుకోవడానికి పక్కా పట్టాలు ఇచ్చాయి. హైదరాబాద్‌కు వలస వచ్చే వారికి గూడు కావాలని బీజేపీ మొదటి నుంచి చెబుతున్నది. రెక్కల కష్టం మీద బతికేవాళ్లకు ఇళ్లు కట్టుకునే స్తోమత ఉండదని నాడు ఆలె నరేందర్‌ మొదలు నాయకత్వం వహించిన బద్దం బాల్‌రెడ్డి, దత్తాత్రేయ కావొచ్చు. మా నాయకులంతా పేదలకు అండగా ఉన్నారు. హైడ్రా బాధితులకు బీజేపీ అండగా ఉన్నది. హైడ్రా హడావుడి ముగిశాక మూసీ నది పరిధిలోని ఇళ్లపై పడ్డారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లు కూలగొట్టి, ఆ భూములు గుంజుకుని మల్టీనేషనల్‌ కట్టబెట్టాలని చూశారు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో భూములు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. మూసీ బాధితుల నుంచి మాకు నిత్యం వందల విజ్ఞప్తులు వస్తున్నాయి. మా ప్లాట్లు గుంజుకుంటున్నరు, మా ఇండ్లు కూల గొడుతున్నరు, మాపై దౌర్జన్యాలు చేస్తున్నారని దరఖాస్తులు వస్తున్నాయి. దీనిపై స్పందించి మల్కాజిగిరి కలెక్టర్‌కు ఫోన్‌ చేశాను. వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పాను. అలాగే పలువురు బిల్డర్లు, గుండాలు, రియల్‌ ఎస్టేట్‌బ్రోకర్లు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇదే సమస్యపై తాము పోలీసులకు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నదని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో చివరి ప్రయత్నంగా మేడ్చల్‌ కలెక్టర్‌కు విన్నవించినట్లు ఈటల తెలిపారు.

First Published:  22 Jan 2025 1:29 PM IST
Next Story