శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే భూభారతి చట్టంపై చర్చ
శాసనసభలో పొద్దున నుంచి బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతున్నది. ఫార్ములా ఈ రేస్ పై సభ్యులు చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్నారు. సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ భారతి బిల్లుపై చర్చ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే భూభారతి చట్టంపై చర్చ కొనసాగుతుండగా ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు ప్లకార్లులు ప్రదర్శిస్తూ వెళ్లారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సభాపతి ప్రసాద్ కుమార్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైనా బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగింది.
ఆందోళనల మధ్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపామన్నారు. లోపభూయిష్టమైన ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేశామన్నారు. భూభారతి చట్టం వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ ను ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు.
అంతకుముందు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి లో రూ. లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. దీనిపై విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను బయటపెడుతామన్నారు. అక్రమాలపై విచారణను సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి మహేశ్వర్ రెడ్డి దగ్గర ఉన్న వివరాలను తనకు అందించాలని కోరారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ..సభను ఆర్డర్ లో పెట్టాలని స్పీకర్ ను కోరారు. ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు అన్నారు. ఓ కుటుంబం కోసం సభ్యులు ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని మండిపడ్డారు. ధరణి వల్ల వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి అన్నారు. ఆ లోపాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలన్నారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే భూభారతిపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.