Telugu Global
Telangana

నిధులివ్వబోమని కేంద్ర మంత్రి చెప్పడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం

రాహుల్‌ గాంధీ ముందు తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిధులివ్వబోమని కేంద్ర మంత్రి చెప్పడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం
X

తెలంగాణలో ఇండ్లు కట్టుకోవడానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వబోమని స్వయంగా ఒక కేంద్ర మంత్రి చెప్పడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ఇలా మాట్లాడారు అంటే అది ముమ్మాటికీ రాష్ట్రాల హక్కులను హరించడమేనని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణపై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన సెమినార్ లో ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, హక్కలను కాపాడడం, పరిపాలనలో పారదర్శకతను పాటించడం, రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశీక సూత్రాలు సమర్థవంతంగా అమలు చేయడం వంటి మొత్తం 19 తీర్మానాలను సెమినార్ లో ఆమోదించారు. ఈ తీర్మానాలతో పాటు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను త్వరలో విద్యార్థులో రాష్ట్ర గవర్నర్ ను కలిసి అందించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అని మాట్లాడుతున్నారంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి రాష్ట్రాల హక్కులు హరించే అధికారం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ఖండించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాకెట్‌ డైరీలా రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరగడం కాదు తెలంగాణలో హననమవుతున్న రాజ్యాంగ స్ఫూర్తిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీని తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి” అని సూచించారు. కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్ లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారని, కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని విమర్శించారు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదని ఎండగట్టారు. “ ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు.. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు” అని ధ్వజమెత్తారు.

First Published:  27 Jan 2025 10:30 AM IST
Next Story