రేవంత్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతది
నీళ్లివ్వలేక పంటలను ఎండబెడుతోంది.. ఈ ప్రభుత్వానికి జలవిధానం లేదా : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని పెదగట్టు లింగమంతులస్వామి జాతరలో ఆమె మొక్కులు చెల్లించుకున్న అనంతరం సూర్యాపేట బీఆర్‌ఎస్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. సాగునీళ్లు ఇవ్వక రైతుల పంటలు ఎండిపోతున్నాయని.. అసలు ఈ ప్రభుత్వానికి జల విధానం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందన్నారు. తక్షణమే మేడిగడ్డ బ్యారేజీని వినియోగంలోకి తెచ్చి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డను ఉపయోగించుకోక రేవంత్ ప్రభుత్వం తెలంగాణను ఎండబెడుతుంటే ఏపీ 199 టీఎంసీలతో బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. మన ముఖ్యమంత్రి మాత్రం నాగార్జున సాగర్ ను కేంద్ర బలగాల అధీనం నుంచి మన రాష్ట్ర పరిధిలోకి తీసుకురాలేకపోతున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలు పారించారని అన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క కోదాడ నియోజకవర్గంలోనే కాళేశ్వరం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 1.22 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు పారడం లేదో మంత్రి ఉత్తమ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డను వినియోగించడం లేదని ఇంజనీర్లు చెప్తున్నారని అన్నారు. ఇంకో 40 రోజులు నీళ్లిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశముందన్నారు. నిరుడు నీళ్లు ఇవ్వక మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగులుతుందన్నారు. సొంత ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేకపోయిన మంత్రి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటేనన్నారు. కేసీఆర్ ప్రజలు, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారని.. కాంగ్రెస్ నాయకులు రోజంతా కేసీఆర్ తిట్టుకుంటూ తిరగడం మినహా చేసిందేమి లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది తన పదవి కాపాడుకోవడానికేనని.. ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని కుర్చీలో కూర్చుంటా అన్నట్టుగా రేవంత్ వ్యవహార శైలి ఉందన్నారు. మహిళలకు రేవంత్ రెడ్డి చేసిందేమి లేదని.. మహిళల అంశాలపై ఇంతవరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేదని.. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మత ఘర్షణలు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పట్టుతప్పిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. బీసీల జనాభాను తగ్గించి చూపించారని.. గందరగోళం, కాకిలెక్కలతో రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితేనే ఈ ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించిందని కానీ ఏ గ్రామంలోనూ రైతులందరి రుణాలు మాఫీ కాలేదన్నారు. రైతుభరోసా కూడా ఒక్క గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదన్నారు. ప్రెస్‌మీట్‌లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు సోమ భరత్ తదితరులు పాల్గొన్నారు.