సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు
గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని కేటీఆర్ ధ్వజం
![సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/06/1400876-ktr.webp)
ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. యూజీసీ నిబంధనల పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి వినతి పత్రం ఇచ్చింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. యూజీసీ నూతన మార్గదర్శకాల పై మా అభిప్రాయాలను నివేదించాం. దీనికోసమే కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను కలిశామన్నారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించేలా యూజీసీ నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
కొత్త నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసకోవద్దని విన్నవించామన్నారు. మరోవైపు ఎన్‌హెచ్-365 బి రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ తెలిపారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు మొన్ననే నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10 మళ్లీ విచారించనున్నది. ఈ విషయంలో మా పార్టీ నాయకుల బృందం న్యాయవాదులను కలుస్తాం. వారిని కలిసి దీన్ని ఇంకా వేగవంతం చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయి, పార్టీ మారిన వారిపై ఏ విధంగా వేటు పడాలి చర్చిస్తాం. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మూడు కార్యక్రమాల కోసమే ఇక్కడి వచ్చామన్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తున్నామన్నారు. తాను మూడు రోజులు ఇక్కడే ఉంటున్నాననే వార్త మీడియాలో చూశానని..అది నాకే తెలవదని సెటైర్ వేశారు.