ఉద్యోగం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల కోసం త్రిసభ్య కమిటీ
కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి నేతృత్వంలో ఏర్పాటు
విధి నిర్వహణలో చిన్న చిన్న పారపాట్లు చేసి ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో భాగంగా బస్టాప్‌లలో బస్సులు ఆపలేదని, సెల్ ఫోన్లు మాట్లాడారని, టికెట్లు ఇచ్చే క్రమంలో గొడవ పడ్డారనే కారణాలతో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలు ప్రజావాణిలో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు వివరించారు. సీఎం, మంత్రి ఆదేశాలతో ప్రభుత్వం గురువారం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. లేబర్, ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ ఎండీ కమిటీకి కన్వీనర్‌గాను వ్యవహరిస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి అర్జీలను పరిశీలించి వారికి ఉద్యోగాల పునరుద్దరణపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.