Telugu Global
Telangana

రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదు..అంబేద్కర్‌ను

దళితబంధు డిమాండ్‌ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని కేటీఆర్‌ ఫైర్‌

రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదు..అంబేద్కర్‌ను
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదని.. అంబేద్కర్‌ను అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించకుండా అడ్డుకుంటున్నారు. ఆయన విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. దళితబంధు తొలిగించి అంబేద్కర్‌ అభయహస్తం తెస్తామన్నారు. ఇప్పుడు దాని ఊసే లేదు. దళితబంధు డిమాండ్‌ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ఇందిరమ్మ పాలనా అంటే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రపంచంలో అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిద్దామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై అక్కసుతో 125 అడుగుల అంబేద్కర్‌ మ్యూజియాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్బంధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అక్కడి వెళ్లి మేమే శుభ్రం చేద్దామనుకుంటే మా నేతలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు అన్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో దౌర్జన్యం చేయడమే మీ రు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా? అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన నాడు రేవంత్‌ రెడ్డి ఎక్కడ ఉన్నారో? వారు చెబుతున్న మిగతా నాయకులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదన్నారు. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, ఆవేదనకు, ఆర్తికి అన్నింటికీ ప్రతిరూపంగా నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసినా వేల మంది మధ్య ఒక దేవతను ఊరేగించినట్లుగా తీసుకొచ్చి ప్రతిష్టించిన నాయకుడు కేసీఆర్‌ . తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహం ప్రదర్శించిన కేసీఆర్‌ ను ఎవరో వచ్చి పిలవడం పెద్ద విషయం కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇక రేవంత్‌రెడ్డి ఆవిష్కరించబోయేది తెలంగాణ తల్లినా? కాంగ్రెస్‌ తల్లినా? అన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియదన్నారు. కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్ల రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చాల్సిన అవసరం ఏమున్నది? అంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి లోగోలో మారాలి..నంబర్‌ ప్లేట్లు మారాలి.. విగ్రహాలు మారాలా? అని ఎద్దేవా చేశారు.

First Published:  6 Dec 2024 1:01 PM IST
Next Story