దావోస్ పెట్టుబడులపై మీడియానే నిజనిర్ధారణ కమిటీ వేసుకోవాలి
ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
దావోస్‌లో తమ ప్రభుత్వం వివిధ సంస్థలతో పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలపై మీడియానే నిజనిర్దారణ కమిటీ వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. ఆయా కంపెనీల దగ్గరికి వెళ్లి పెట్టుబడులు పెడుతామని ఎంవోయూ చేసుకున్నది నిజమేనా అని ప్రశ్నించాలని సూచించారు. దావోస్‌లో పెట్టుబడుల కోసం ఆయా కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామని చెప్పారు.. ''ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే పెళ్లి చూపులు అయిపోయినయి.. లగ్న పత్రిక రాసుకున్నం.. ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందున్నయి..'' అని వివరించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దావోస్‌లో తాము రూ.1.80 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు సాధించేలా ఎంవోయూలు చేసుకున్నామని, అవి వాస్తవ రూపం దాల్చుతాయన్న నమ్మకం తమకు ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. దావోస్ పెట్టుబడులతో రాష్ట్రంలో 49,500 ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమని.. అందుకే అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. గతేడాది రూ.40 వేల కోట్లు పెట్టబడి పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. 18 కంపెనీలు ఎంవోయూ చేసుకుంటే 17 తమ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.