శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
మంత్రివర్గ భేటీ దృష్యా వాయిదా వేయాలని కోరిన శ్రీధర్‌బాబు..అంగీకరించిన స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సభను వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ సమావేశం ప్రారంభమైందని, ఇంకా పూర్తికాలేదు. ఇంకొ కొంత సమయం పడుతుందన్నారు. మినట్స్ ప్రిపరేషన్, నోట్స్ ప్రిపరేషన్కు సమయం పడుతున్న సందర్భంలో సభను వాయిదా వేయాల్సిందిగా సభాపతిని కోరారు. ఎందుకంటే సహచర మంత్రులు, డిప్యూటీ సీఎం, సీఎం అందరూ మంత్రివర్గ భేటీలో ఉన్నారు. సభను కొంత సేపు వాయిదా వేసి తిరిగి ప్రారంభించాల్సిందిగా మంత్రి కోరారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు మండలినీ వాయిదా వేయాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కోరారు. దీంతో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక సర్వే నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణపై నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. అనంతరం శాసనసభ ముందుకు సామాజిక, ఆర్థిక సర్వేలు రానున్నాయి. వీటిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అసెంబ్లీలో కులగణన స్వల్పకాలిక చర్చపై అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పనై సభలో తీర్మానం చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక అందజేసింది. ఎస్సీ ఉప కులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఏకసభ్య కమిషన్, కులగణన నివేదికపై ఉభయసభల్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నది.