Telugu Global
Telangana

వాళ్లను గల్లా పట్టుకొని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

వాళ్లను గల్లా పట్టుకొని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్‌
X

బూటకపు హామీలిచ్చి.. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు గల్లాలు పట్టుకొని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో నిర్వహించిన ఖమ్మం జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందుల్లో ఉంటే ఎన్నికల్లో ఓడినా పువ్వాడ అజయ్‌ వారందరికీ అండగా నిలిచారని గుర్తు చేశారు. మంత్రులు బర్త్‌ డే ఫంక్షన్లకు పోవడానికి హెలీక్యాప్టర్లు ఉంటాయి కానీ ఖమ్మం ప్రజల్లో చిక్కుకున్నప్పుడు మాత్రం హెలీక్యాప్టర్‌ పంపలేదన్నారు. డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మం ప్రజలు వరదల్లో చిక్కుకున్నప్పుడు వాళ్లతో పైసా పని కాలేదన్నారు. ప్రజల ప్రాణాల విలువ తెలుసుకాబట్టే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరదలొస్తే భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు నాలుగు హెలీక్యాప్టర్లు పంపి ప్రజల ప్రాణాలు కాపాడామన్నారు. ఖమ్మంలో వరద తగ్గిన తర్వాత ముఖ్యమంత్రి ఓపెన్‌ టాప్‌ జీపులో చేతులు ఊపుతూ అటూఇటూ తిరిగి వెళ్లిపోయాడన్నారు.

రేవంత్‌ రెడ్డికి రేషం లేదని.. ఇంకొకరైతే ప్రజలు తిడుతున్న తిట్లకు బకెట్‌ నీళ్లల్లో దూకి చచ్చిపోయేవారని అన్నారు. రేషం లేనివాడు కాబట్టే రేవంత్‌ అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. యువతులు తమ స్కూటీ ఏమైందని పోస్టుకార్డు ఉద్యమం మొదలు పెట్టారని, ఈ ప్రభుత్వం చేతిలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామన్న భావన తెలంగాణలోని ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, కాంట్రాక్టర్‌ అయిన ఖమ్మం జిల్లా మంత్రి భారీగా దండుకుంటున్నారని.. వారి అవినీతిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బాహాటంగా చెప్తున్నారని అన్నారు. రుణమాఫీ పూర్తికాలేదని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుంటే అందరి రుణాలు మాఫీ చేశామని సీఎం అంటున్నారని.. అంటే ఈ ప్రభుత్వంలో సీఎం, మంత్రులకు మధ్య శృతి కలవడం లేదని స్పష్టంగా తెలుస్తుందన్నారు. బీసీలను ఈ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హనీమూన్‌ టైం అయిపోయిందని.. కళ్యాణ లక్ష్మీ చెక్కులిస్తుంటూ తులం బంగారం ఏదని ఒక మంత్రిని మహిళలలు ప్రశ్నించారని అన్నారు. పోలీసుల అండతో ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలకు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని హెచ్చరించారు. త్వరలోనే ఖమ్మం వస్తానని కార్యకర్తలకు అండగా నిలుస్తానని అన్నారు.

First Published:  11 Feb 2025 4:17 PM IST
Next Story