కాంగ్రెస్ పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచేయలేవు
పారదర్శకంగా రూ. 46 కోట్ల బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్ ఎక్కడిది? అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్న
ఈడీ విచారణకు హాజరయ్యే ముందు 'ఎక్స్' వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ అనేది తాను మంత్రిగా తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటని అన్నారు. ఆనాడు రేసర్లంతా హైదరాబాద్ నగరాన్ని కీర్తించారని తెలిపారు. తనకెప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ముఖ్యమన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచేయలేవని చెప్పారు.
పారదర్శకంగా రూ. 46 కోట్ల బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది? మనీ లాండరింగ్ ఎక్కడిది? ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు.. ప్రతి పైసాకు లెక్క ఉన్నది. ఫార్ములా ఈ రేస్ రద్దు వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఎలాంటి అవినీతి జరగకున్నా కేసులు, కోర్టులంటూ రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డికి దూరదృష్టి లేకపోవడం వల్లనే ఏకపక్షంగా తర్వాతి సీజన్ రద్దు చేశారు. తప్పులేకపోయినా ఏదోకాలం వెళ్లదీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తప్పకుండా త్వరలోనే నిజం తెలుస్తుంది అని కేటీఆర్ రాసుకొచ్చారు.