Telugu Global
Telangana

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం

ఖమ్మం జిల్లాలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
X

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిఅన్నారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా రూ. 54 కోట్ల వ్యయంతో 27 చెరువుల కింద 2400 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి ఆయన మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఉగాదిలోపే ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్ఉటకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఖమ్మంలోనే కీలక మంత్రులు ఉన్నారు. ఖజానా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల్లో ఉన్నది. పొంగులేటి వద్ద రెవెన్యూ, హౌసింగ్‌, తుమ్మల చేతుల్లో వ్యవసాయశాఖ ఉన్నది. అందుకే ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలను కూడా ఆయకట్టులోకి తీసుకురాలేదు. పాలమూరు, సీతారామ పరిస్థితి కూడా అంతే. అందుకే మేం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఎకరాకు నీరందించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ వానాకాలం వరి పంట రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. తెలంగాణ వరి రైతులు రికార్డు సృష్టించారు. సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న పంపులను ఆన్‌ చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకు గత పదేళ్లలో అమలు కాని పథకాలను అమలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. రూ. 10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, రూ. 22 వేల కోట్ల రుణమాఫీ, రూ. 500కే సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలు అమలు చేశామన్నారు. ఖమ్మం జిల్లాను వ్యవసాయపరంగానే కాదు భవిష్యత్తులో పారిశ్రామికంగానూ అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నానని భట్టి తెలిపారు.

First Published:  13 Jan 2025 5:56 PM IST
Next Story