Telugu Global
Telangana

విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకా మీ విజయోత్సవాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేరా : మాజీ మంత్రి హరీశ్‌ రావు

విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకా మీ విజయోత్సవాలు
X

విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు చేసుకుంటుందా అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేరా అని నిలదీశారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ప్రశాంత్‌ నగర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్లు ఆగమైపోయాయని, వేలాది మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. 49 మంది విద్యార్థులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. కేసీఆర్‌ వెయ్యికి పైగా గురుకులాలు స్థాపించి వాటి గౌరవాన్ని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలబెట్టారని, రేవంత్‌ పాలనలో అవి అధోగతి పాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లోని విద్యార్థులకు ఆరు నెలలుగా మెస్‌ చార్జీలు చెల్లించలేదన్నారు. ఈ ఒక్క హాస్టల్‌కే రూ.9.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, వార్డెన్లు బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే టీచర్లు, వార్డెన్లను సస్పెండ్‌ చేస్తామని సీఎం అంటున్నారని.. మెస్‌ బిల్లులు ఇవ్వని రేవంత్‌ను కదా శిక్షించాల్సింది అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు గడప కూడా దాటవని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ పుట్టిన రోజుకు ఫుడ్‌ పేజీ యాడ్స్‌, తొమ్మిది రోజుల విజయోత్సవాలు, ఫోర్త్‌ సిటీ, రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు ఇవే రేవంత్‌ రెడ్డి ప్రాధాన్యతలు తప్ప పేద విద్యార్థులు కాదన్నారు. హాస్టళ్లలో పనిచేస్తున్న పార్ట్‌ టైం సిబ్బందికి 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఎస్సీ గురుకులాల్లో ఆరు నెలలుగా కాస్మొటిక్‌ చార్జీలు ఇవ్వలేదని తెలిపారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ ఫుడ్‌ పాయిజన్‌ అయిన తాండూరు హాస్టల్‌ కు వెళ్తుంటే ప్రభుత్వం పోలీసులో వారిని మధ్యలోనే అరెస్టు చేయించిందన్నారు. హాస్టళ్లు సక్రమంగా నడిపితే మాజీ మంత్రులను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను విస్మరిస్తున్నాడని అన్నారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, అరెస్టు చేయడం కాదు.. హామీలు అమలు చేయడం అని గుర్తించాలన్నారు.

First Published:  12 Dec 2024 8:32 PM IST
Next Story