సెమీకండక్టర్ అసోసియేషన్‌తో సమావేశమైన శ్రీధర్‌బాబు
సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించిన తెలంగాణ ప్రతినిధి బృందం
సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సెమీకండక్టర్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఆ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ ఛైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ ఛైర్మన్ టాన్ యూ కాంగ్ పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటునకు అనుకూలమైన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కీలక కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధులను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్ వస్తామని తెలిపారు.
అంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్‌తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేవంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు-నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ సహా వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.