ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్
పూర్తిస్థాయిలో సహకరిస్తామని రేవంత్‌కు మోడీ హామీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. సొరంగంలో 8 మంది చిక్కుకున్నారని, వారిని కాపాడటానికి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఘటనా స్థలికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు ప్రధాని రేవంత్‌కు చెప్పారు. పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం ఘటనా స్థలికి చేరుకున్నాయి. సింగరేణి నిపుణుల బృందం కూడా అక్కడికి వెళ్లనున్నది. నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.