Telugu Global
Telangana

ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల పరిశీలన 95 శాతం పూర్తి

ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల పరిశీలన 95 శాతం పూర్తి
X

ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తుల్లో 95 శాతం పరిశీలన పూర్తయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలనే లక్ష్యంతోనే ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ ను తీసుకువస్తున్నామని చెప్పారు. గురువారం సెక్రటేరియట్‌లో indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ ను ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులు వెళ్తాయన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఇండ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని జిల్లాల్లో 95 శాతం అప్లికేషన్ల పరిశీలన పూర్తికాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ లో 88 శాతం అప్లికేషన్‌లు పరిశీలించామన్నారు. మొదటి దశలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తామని.. రెండో దశలో ప్రభుత్వమే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. చివరి లబ్ధిదారుడి వరకు ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  9 Jan 2025 4:57 PM IST
Next Story