కొడంగల్‌లో పిల్లల పరేడ్‌తో సీఎం సోదరుడికి స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఒక్క సీఎంను ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారని కేటీఆర్ 'ఎక్స్'లో సెటైర్
రాష్ట్రంలో ప్రజాపాలనను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ అయ్యాక ఆయన ఫ్యామిలీ పాలన నడుస్తున్నది. రేవంత్ రెడ్డి అన్న ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, జడ్పీటీసీ, ఎంపీటీసీ కాదు.. చివరికి సర్పంచ్ కూడా కాదు. కానీ ఆయనకు పోలీస్ కాన్వాయ్, స్కూల్ పిల్లలతో పరేడ్, చివరికి వికారాబాద్ కలెక్టర్ బాడీగార్డ్ అయ్యాడు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించి పోలీసు బందోబస్తు, కాన్వాయి ఉండటంతో పాటు బూట్లు తీయించి స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి ప్రధాని,రాష్ట్రపతి,ముఖ్యమంత్రికి చేసినట్లు పరేడే చేయించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్‌ల్ వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన సాగుతున్నదని, రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది అనడానికి ఇదే నిదర్శనమని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఒక్క సీఎంను ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారని, 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ ను స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో! వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! అంటూ సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక…నాది ఒక చిన్న విన్నపం! ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను! IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని కేటీఆర్ రాసుకొచ్చారు.
మాట్లాడితే రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ విమర్శిస్తుంటారు. అయితే కేసీఆర్ కుటుంబసభ్యులంతా ప్రజల ఆమోదంతో చట్టసభలకు ఎన్నికయ్యారు. కానీ కనీసం సర్పంచ్ కూడా కాని తిరుపతి రెడ్డి పక్కన వికారాబాద్ కలెక్టర్ సామాన్యుడిగా ఉండిపోయారు. స్థానిక నాయకులు వంగి వంగి దండాలు పెట్టారు. వీటన్నింటినీ తిరుపతి రెడ్డి ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. దీనికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతున్నదంటున్న ఎమ్మెల్సీ కోదండరామ్, ఆకునూరి మురళి లాంటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.