కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ లెక్క రేవంత్ రెడ్డి పాలన
కాంగ్రెస్ హామీలపై ఈనెల 31న గాంధీ విగ్రహాల వద్ద నిరసన : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అహా నా పెళ్లంటా సినిమాలో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ లెక్క రేవంత్ రెడ్డి పాలన ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌వీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నిజం గడపదాటేలోపే అబద్ధం ఉరంతా చుట్టివచ్చే రోజులివి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇలాగే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించిందని గుర్తు చేశారు. అహ నా పెళ్లంటా సినిమాలో కోట శ్రీనివాస్ రావు పిసినారి క్యారెక్టర్‌లో నటించారని.. చికెన్ పెడుతానని కోడిని ముందు వేలాడదీసి ప్లేట్‌లో అన్నం, చట్నీ వడ్డిస్తారని.. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు అలాగే ఉందన్నారు. భారీ డైలాగులు కొట్టుడు.. గంబీరమైన ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప చేసిందేమి లేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మాటలు వింటుంటే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కావడం లేదన్నారు. రేషన్ కార్డులివ్వడం ఏదో చారిత్రాత్మకం అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. డిప్యూటీ సీఎం అలాంటి డైలాగులే కొట్టారని అన్నారు. 2021 జూలై నెలలో మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క స్వయంగా కొత్త రేషన్ కార్డులు అందజేశారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6.50 లక్షల కొత్త రేషన్ కార్డులిచ్చినా ఎక్కడా ప్రచారం చేసుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటే మనవాళ్లు కూడా నిజమే కావొచ్చు అనుకునే పరిస్థితి ఉండేదన్నారు.
సీఎం, మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు గోబెల్స్‌ను మించిపోయారన్నారు. డిక్లరేషన్ అనేది చాలా పెద్ద నిర్ణయమని.. గల్లీ కాంగ్రెస్ లీడర్లను నమ్మరని.. ఢిల్లీ నుంచి, కర్నాటక నుంచి నాయకులను రప్పించి ఇచ్చిన రైతు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, విద్యార్థి డిక్లరేషన్‌లలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. 294 ఉన్న గురుకులాలను వెయ్యికి పెంచామని.. జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడంతో పాటు యూనివర్సిటీలకు మహనీయుల పేర్లు పెట్టామన్నారు. రూ.7.400 కోట్లతో మన ఊరు - మన బడి పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు, వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ యువతకు హామా ఇచ్చి 400 రోజులు గడిచిన సందర్భంగా జనవరి 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గాంధీ విగ్రహాల వద్ద నివాళులర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని యువత, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 400 మందికిపైగా రైతులు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే సంతోషిస్తామని.. కానీ ఈ ప్రభుత్వం చెప్తున్న పెట్టుబడులు అబద్ధమనే విషయం ప్రజలకు తెలుసన్నారు. నిరుడు తెచ్చామని చెప్తోన్న రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చలేదన్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే వారు తెస్తామన్న పెట్టుబడులు ఎప్పటిలోగా పూర్తవుతాయి.. వాటితో ఎప్పటిలోగా ఉద్యోగాలు వస్తాయో చెప్తే తామే వాళ్లకు సన్మానం చేస్తామన్నారు. 12 వేలకు పైగా గ్రామాలుంటే 600 గ్రామాల్లోనే పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారని, మిగతా వాళ్లకు ఎప్పటిలోగా ఆయా పథకాలు అందజేస్తామరో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.