లగచర్ల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది
కొడంగల్ నియోజకవర్గ నేతల సమావేశంలో కేటీఆర్
లగచర్ల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, గురుకులాలు సహా రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎవరినో అరెస్టు చేసేందుకు గంటల తరబడి క్యాబినెట్ మీటింగుల్లో చర్చించడం కాదు.. ప్రజలకు మంచి చేసేందుకు అధికారం ఇచ్చారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కొడంగల్ ప్రజల కోసం పట్నం నరేందర్ రెడ్డి ఉక్కు మనిషిగా నిలబడ్డాడని, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు చేస్తాడని అన్నారు. లగచర్ల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. రైతు రుణమాఫీ సహా అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి సహా ఏ ఊరులోనూ వంద శాతం రైతు రుణాలు మాఫీ కాలేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఏడాది పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్‌ఎస్ కార్యకర్తలనే తట్టుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డి పోలీసుల అండతో కొడంగల్‌లో అరాచకం చేస్తున్నాడని మండిపడ్డారు. తన అల్లుడు, అదానీ కోసమే రేవంత్ భూ సేకరణకు పూనుకున్నాడని తెలిపారు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలని అనుకుంటే వెల్దండలో రేవంత్ కుటుంబ సభ్యులకు ఉన్న 500 ఎకరాల భూముల్లోనే వాటిని ఏర్పాటు చేయాలన్నారు. లగచర్ల అంశాన్ని వదిలి పెట్టబోమని.. అసెంబ్లీ నడిచినన్ని రోజులు లేవనెత్తుతూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, గోరటి వెంకన్న, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.