Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నరు

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలే : మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ రాజయ్య

రేవంత్‌ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నరు
X

సీఎం రేవంత్‌ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ మాణిక్‌ రావు, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బొమ్మెర రామ్మూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కేటగిరిల్లో వివేక్‌ వెంకటస్వామి హస్తం ఉందన్నారు. మల్లికార్జున ఖర్గే, కొప్పుల రాజు, భట్టి, వివేక్‌ లాబీయింగ్‌ కు రేవంత్‌ తలొగ్గారని అన్నారు. బుడిగజంగాలను ఏ గ్రూప్‌లో చేర్చి, నేతకాని కులాన్ని సీ గ్రూప్‌లో చేర్చారని తెలిపారు. దశాబ్దాలుగా వివక్ష అనుభవిస్తున్న మాదిగలకు రేవంత్‌ ప్రభుత్వం చేసిన వర్గీకరణతో న్యాయం జరగలేదన్నారు. కులాల కేటగరైజేషన్‌ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాదిగలకు అనుకూలంగా లేరన్నారు. జనాభా ప్రకారం మాదిగలకు 11 శాతం రిజర్వేషన్‌ దక్కాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చారని, దేనిని ప్రమాణికంగా తీసుకొని ఎస్సీలను మూడు కేటగిరిలుగా చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఎస్సీల మధ్య రేవంత్‌ చిచ్చు పెడుతున్నడు : గువ్వల బాలరాజు

ఎస్సీల మధ్య రేవంత్‌ రెడ్డి చిచ్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఏడో తేదీన మంద కృష్ణమాదిగ తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతుకల కార్యక్రమాన్ని వాయిదా వేయించే ప్రయత్నంలో రేవంత్‌ సఫలమయ్యారన్నారు. ప్రభుత్వం తెచ్చిన వర్గీకరణతో మాదిగలు సంబరాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. లబ్ధిపొందిన కొన్ని ఉప కులాలను ఏ కేటగిరిలో చేర్చారని, సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా ఎదిగిన కులాలకే న్యాయం జరిగిందన్నారు. మాదిగలకు 11 శాతం రిజర్వేషన్‌ దక్కే వరకు పోరాడుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మాదిగలకు వ్యతిరేకమేనని ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. మోకాళ్లలో మెదడు ఉన్నోళ్లే రేవంత్‌ రెడ్డిని అభినవ అంబేద్కర్‌ అని కొనియాడుతున్నారని మండిపడ్డారు. అది ఏకసభ్య కమిషన్‌ రిపోర్టా? కాంగ్రెస్‌ పార్టీ రిపోర్టా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణ విషయంలో క్రెడిట్‌ ఇవ్వాల్సింది ఒక్క మంద కృష్ణమాదిగకేనని తేల్చిచెప్పారు.

First Published:  5 Feb 2025 4:47 PM IST
Next Story