Telugu Global
Telangana

గురుకులాలను రేవంత్‌ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నడు

ఒకప్పుడు సీట్ల కోసం పోటీ పడేవారు.. ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

గురుకులాలను రేవంత్‌ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నడు
X

గురుకులాలను సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యతో పాటు ఇరిగేషన్‌, అగ్రికల్చర్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, రియల్‌ స్టేట్‌ రంగాలను రేవంత్‌ రెడ్డి సర్కారు నాశనం చేస్తుందన్నారు. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్లలో విద్యార్థి మరణం, బాలానగర్‌లో ఆరాధ్య అనే విద్యార్థి ఆత్మహత్య తమను తీవ్రంగా బాధించాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో పరిస్థితుల్లో సిగ్గుతో తలదించుకునే మారాయన్నారు. కేసీఆర్‌ హయాంలో గురుకులాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు, నలుగురు పోటీ పడేవారని.. ఇప్పుడు ప్రవేశ పరీక్ష గడువు తేదీ మూడుసార్లు పొడగించినా కనీసం దరఖాస్తు చేసుకునే వారు కరువయ్యారని అన్నారు. విద్యారంగాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికే రేవంత్‌ రెడ్డి తన దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నారేమోనని సందేహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ హయాంలో 30కిపైగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు వాటిల్లో శిక్షణ ఇప్పించేవారన్నారు. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌ వాటిలో తయారయ్యారని గుర్తు చేశారు. భువనగిరి సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తే దానిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 57 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పారు. గురుకులాల విద్యార్థులు అనీమియాతో చనిపోతున్నారంటే వారికి అందిస్తున్న ఆహారం నాణ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. మెడికల్‌ కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల ట్యూషన్‌ ఫీజులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని.. అంటే ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. రజక కులానికి చెందిన గురుకుల విద్యార్థిని నందిని బ్యాడ్మింటన్‌ నేషనల్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోత్సాహకం కూడా ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె బీసీ కాబట్టే ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదా అని నిలదీశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని ఒక గురుకులంలో ఇద్దరు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్ తో అస్వస్థతకు గురైతే బీఆర్‌ఎస్‌ నాయకులు, టీ న్యూస్‌ రిపోర్టర్‌ పై కేసు పెట్టారని.. బాధిత విద్యార్థులను రెండు గంటలు పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి విచారించారని తెలిపారు. చదువుకోవాల్సిన విద్యార్థులను ఠాణాకు తీసుకెళ్లి విచారించిన దుర్మార్గపు పాలన రేవంత్‌ ది అని.. ఎంత దొంగరగా సాధ్యమైతే అంత త్వరగా రేవంత్‌ ను ఇంటికి పంపాలని అన్నారు.

First Published:  14 Feb 2025 4:18 PM IST
Next Story