Telugu Global
Telangana

రుణమాఫీపై రేవంత్‌ పీచేమూడ్‌!

కేటీఆర్‌ సవాల్‌ మాటే ఎత్తని ముఖ్యమంత్రి

రుణమాఫీపై రేవంత్‌ పీచేమూడ్‌!
X

అసెంబ్లీ సాక్షిగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారు. రూ.2 లక్షల వరకు ఉన్న రైతులందరి రుణాలు మాఫీ చేశామని చెప్పే ప్రయత్నం చేసినా.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ ను స్వీకరించడానికి ముందుకు రాలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్తోన్నట్టుగా రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి ఉంటే కేటీఆర్‌ సవాల్‌ స్వీకరించవచ్చు.. కానీ అలాంటి ప్రయత్నం రేవంత్‌ చేయలేదు. రుణమాఫీపై గతంలో ఒకసారి చాలెంజ్‌ స్వీకరించే చేతులు కాల్చుకున్నాం కాబట్టి ఇక సేఫ్ గేమ్‌ ఆడటమే బెటర్‌ అన్న ధోరణిలోనే రేవంత్‌ రెడ్డి ప్రసంగం కొనసాగింది. సభా నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డిపై ఉంటుంది. కానీ శనివారం ఆయన ప్రసంగం తీరు మొత్తం రాజకీయ కోణంలోనే సాగింది. అసెంబ్లీ వేదికగా సభా నాయకులు ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.. అదే సమయంలో ప్రతిపక్షం నుంచి అందివచ్చిన అవకాశాలను జార విడుచుకోరు. కొండారెడ్డిపల్లి, కొడంగల్‌, సిరిసిల్ల, పాలేరులో ఏ ఒక్క గ్రామంలో వంద శాతం రైతు రుణాలు మాఫీ అయిన తాను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీ వేదికగా కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ కు భవిష్యత్‌ నాయకుడిగా ఉన్న కేటీఆర్‌ ఆన్‌ ది ఫ్లోర్‌ అలాంటి సవాల్‌ చేస్తే అధికారపక్షం దానిని అందిపుచ్చుకోవాలి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా సవాల్‌ను స్వీకరించాలి.

కేటీఆర్‌ రాజకీయ సన్యాసం సవాల్‌ విసిరిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 28,052 కోట్ల రుణమాఫీ చేస్తే తమ ప్రభుత్వం ఏడాదిలో రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశామని ప్రకటించారు. స్టేట్‌ లెవర్‌ బ్యాంకర్స్‌ కమిటీ లెక్కల ప్రకారం రైతు రుణాలు రూ.49 వేల కోట్లు కాగా.. రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.31 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఆ లెక్కన చూసుకున్న ఇంకా రూ.11 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి గతంలో ఆన్‌ రికార్డ్‌ చెప్పిన లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మాఫీ చేయాల్సిన మొత్తం అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే రేవంత్‌ రెడ్డి తెలివిగా కేటీఆర్‌ సవాల్‌ పై మౌనమే మంచిదని అనుకున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సవాళ్లు, మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాళ్లకు రియాక్ట్‌ అయి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి కమిట్‌ అయి నిండా మునిగామనే విషయం రేవంత్‌ రెడ్డికి అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. అందుకే మరోసారి సవాల్‌ కు సై అంటే తలబొప్పి కట్టడం ఖాయమనే భయం రేవంత్‌ ను వెంటాడింది. కేటీఆర్‌ తనకు తానుగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరిన తర్వాత కూడా రేవంత్‌ దానిని అడ్వాంటేజ్‌ గా తీసుకునే ప్రయత్నం చేయలేదు అంటేనే రైతు రుణమాఫీ పూర్తి చేయడం ఇక ఈ ప్రభుత్వం తరం కాదన్నది నిజం.

రుణమాఫీ వంద శాతం చేయకపోవడం ఒక ఎత్తయితే రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఇంకోవైపు నుంచి ఎదురవుతున్నాయి. రూ.2 లక్షలకు పైగా అప్పులు తీసుకున్న రైతులు.. ఆపైన ఉన్న అప్పు మొత్తాన్ని చెల్లిస్తే వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను నమ్మి కొందరు రైతులు అమాయకంగా బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లించారు. తమకు రూ.2 లక్షల రుణమాఫీ తథ్యమని వాళ్లంతా ఎదురు చేస్తున్నారు. ఆ రైతులు బ్యాంకుల్లో డబ్బులు కట్టిన తర్వాత రూ.2 లక్షల వరకు ఉన్న అప్పులు మాత్రమే మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని.. అది పూర్తయ్యింది కాబట్టి ఇక రుణమాఫీ అనేదే లేదని రేవంత్‌ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వ ప్రకటనను నమ్మి రూ.2 లక్షలకు పైబడి ఉన్న అప్పులు కట్టిన రైతుల పరిస్థితి ఏమిటి? ఇక వాళ్లకు రుణమాఫీ వర్తింపజేయరా అనే ప్రశ్నలకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. రూ.2 లక్షల వరకు అప్పులుండి సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని వాళ్లకు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీపై ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పిన సీఎం.. గద్దెనెక్కిన తర్వాత ఆ హామీకి ఎట్లా పరిమితులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలా అని చూశారు. ఒక కుటుంబంలో ఒకరికి లబ్ధి, రేషన్‌ కార్డు, పీఎం కిసాన్‌ ఇలా అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. ఇప్పుడు ఏ ప్రాథమిక వ్యవసాయ సహకరా సంఘం, బ్యాంకుల వద్దకు వెళ్లినా రుణమాఫీ కాని రైతులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సీఎం ప్రకటన తర్వాత వారి రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం కుదరట్లేదు. కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడంలో రైతులు ప్రధానంగా పని చేశారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి నెత్తిపైనే చేతులు పెట్టింది. రుణమాఫీ హామీపై పీచేమూడ్‌ అన్నది.

First Published:  21 Dec 2024 4:06 PM IST
Next Story