చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్
ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించిన ఎంపీ ఈటల
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని నరేంద్రమోడీ సమున్నతంగా కాపాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం ఈటల మాట్లాడారు. ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద.. సమస్త ప్రజల అవసాలను తీర్చాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పారన్నారు. వర్ధంతి సందర్భంగా ఈ మహనీయుడి ఆశయాలను గుర్తు చేసుకుని అమలు చేయడానికి కృషి చేయాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తున్నది. ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం సాధించారని అన్నివర్గాలు ప్రశ్నిస్తున్నాయి. హోదా, స్థాయి మరిచి ఆయన చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కిషన్‌రెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఖండిస్తూ నిర్వహించే సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని ఈటల రాజేందర్ తెలిపారు.