Telugu Global
Telangana

ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఎండొద్దు

ప్రణాళికాబద్ధంగా సాగునీటిని విడుదల చేయాలి : అధికారులకు సీఎం ఆదేశం

ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఎండొద్దు
X

ఎండలు పెరిగే కొద్దీ సాగునీటి సరఫరాలో గడ్డు పరిస్థితులు తలెత్తే అవకాశముందని.. ఈ నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా నీటిని విడుదల చేస్తూ ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో యాసంగి సీజన్‌లో సాగునీటి సరఫరా, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులు పరిశీలించాలని.. వాటికి అనుగుణంగా పరిష్కారమార్గాలు అనుసరించాలన్నారు. రైతులు ఇబ్బంది పడుకుండా, పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగు నీటికి తాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగు నీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని సీఎం అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు, సాగునీటిని అందించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో వెంటనే సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన టెలీమెట్రీ స్టేషన్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులన్నీ తెలంగాణ ప్రభుత్వమే కృష్ణా బోర్డుకు చెల్లిస్తుందని పేర్కొంటూ వెంటనే లేఖ రాయాలని ఇరిగేషన్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాను ఆదేశించారు. ఏపీ తన వాటాకు మించి నీటిని తరలించుకుపోతుంటే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై కేంద్రానికి ఫినర్యాదు చేయాలని ఆదేశించారు.

First Published:  17 Feb 2025 5:14 PM IST
Next Story