కన్నుల పండుగగా ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్ట
ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌లు హాజరై ప్రత్యేక పూజలు హోమాలు చేశారు. ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శాంతిభద్రతలకు చర్యలు తీసుకుంటూ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట చేయడం సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దేవాలయాల పట్ల, ప్రార్థనా మందిరాల పట్ల రాజకీయం తగదన్నారు. అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎలాంటి విద్రోహానికి పాల్పడినా అందరూ కలిసి ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల విశ్వాసాలను కాపాడే విధంగాముందుకు వెళ్తుందన్నారు.
మరోవైపు ముత్యాలమ్మ దేవాలయం వద్ద మోండా మార్కెట్ బీజేపీ కార్పొరేటర్ దీపికకు సంబంధించిన బ్యానర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలిగించడంపై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడటం మానేసి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.