Telugu Global
Telangana

గల్లీకి కాదు మెదక్‌ జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టు

గద్దర్‌ ను చంపిందే కాంగ్రెస్‌ పార్టీ.. రేవంత్‌ రెడ్డిపై రసమయి ఫైర్‌

గల్లీకి కాదు మెదక్‌ జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టు
X

విశ్వవ్యాప్తమైన గద్దర్‌ పేరును నాంపల్లి గల్లీకి పెడతావా రేవంత్‌ రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఫైర్‌ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్‌లో గాయకుడు సందీప్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గద్దర్‌ పేరును గల్లీకి కాదు మెదక్‌ జిల్లాకు పెట్టాలని సూచించారు. రేవంత్‌ మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమవ్యాప్తికి గద్దర్‌ కాలికి గజ్జ కట్టి పని చేస్తున్న రోజుల్లో ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టింది రేవంత్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. గద్దర్‌తో ఏ ఒక్క రోజైనా వేదిక పంచుకున్నావా అని నిలదీశారు. గద్దర్‌ పై కాల్పులు జరిపించింది నీ గురువు చంద్రబాబు కదా అని గుర్తు చేశారు. గద్దరన్న కలిసి నడిచింది తాము అని.. ఆయన కాలికి గజ్జెలుగా పని చేశామన్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడిన గద్దర్‌ను కాంగ్రెస్‌ నాయకుడిగా పరిచయం చేయడం దుర్మార్గమన్నారు. పసివాడి లాంటి మనసున్న గద్దర్‌ను కాంగ్రెస్‌ నాయకులు మాయ చేసి రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు, భట్టి పాదయాత్రకు తీసుకెళ్లి నడిపించారని.. భట్టి పాదయాత్రలో నడవడంతోనే గద్దర్‌ అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. గద్దర్‌ ను చంపిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆరోపించారు.

గద్దర్‌ బిడ్డ వెన్నెలకు ఉప ఎన్నికల్లో ఎందుకు టికెట్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు. గద్దర్‌ను ఒక కులానికి పరిమితం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం చూస్తున్నారని.. ఆయనకు కులం.. వర్గం అంటూ ఏమీ లేవన్నారు. మంద కృష్ణకు పద్మశ్రీ వస్తే ఆయనను అభినందించే తీరిక రేవంత్‌ రెడ్డికి లేదన్నారు. హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా నిన్న కాంగ్రెస్‌ నాయకులు గద్దర్‌ సంస్మరణ సభ నిర్వహించారన్నారు. గద్దర్‌ ఏ ఒక్క రోజు కూడా అవార్డుల కోసం పాకులాడలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాజర్‌ అనే బుర్రకథా కళాకారుడికి పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తే గద్దర్‌ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అవార్డు ఎలా తీసుకుంటావని అప్పుడు అజ్ఞాతం నుంచి గద్దర్‌ లేఖ రాశారని తెలిపారు. పద్మశ్రీ లాంటి అవార్డులను వ్యతిరేకించే గద్దర్‌ పేరును రేవంత్‌ రెడ్డి ఆ అవార్డుకు ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించారు. ఆయనకు గద్దర్‌ గురించే తెలియదు కాబట్టే సిఫార్సు చేశారన్నారు. గద్దర్‌ పై రేవంత్‌ గద్దలా వాలాడని.. ఆయన చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. గతంలో నంది అవార్డును కూడా గద్దర్‌ తిరస్కరించారని గుర్తు చేశారు. అలాంటి గద్దర్‌ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

First Published:  1 Feb 2025 4:20 PM IST
Next Story