ఈనెలాఖరుకే ఇరిగేషన్ లో ప్రమోషన్లు
ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రక్రియ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈనెలాఖరుకు ప్రమోషన్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జలసౌధలో తెలంగాణ ఏఈఈ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రమోషన్లతో పాటే ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్సీ (ఓం అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డిలతో కూడిన ఫైమ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ చేపడుతామన్నారు. న్యాయ పరమైన చిక్కులను అధిగమించేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇరిగేషన్ అప్పులు, వడ్డీలకే ఏటా రూ.11 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 700 మంది ఏఈఈలు, 1,800 మంది లష్కర్‌లను నియమించామన్నారు. మరో 1,300 ఉద్యోగాలు త్వరలో నియమిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ హరిరామ్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, ఏఈఈ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస రావు, సత్యనారాయణ, నాయకులు బండి శ్రీనివాస్, నాగరాజు, సమరసేన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.