మూడేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
రూ.2 లక్షల లోపు రైతు రుణాలు ఖచ్చితంగా మాఫీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితో ప్రభుత్వం ఏర్పడిందని.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు. కేబినెట్‌లోని మంత్రులందరూ 18 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు ఖచ్చితంగా మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ ఎక్కడ జరిగిందని కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ.8,400 కోట్లు జమ చేస్తామన్నారు. భూమిలేని నిరుపేదలకు 26 నుంచి రూ.12 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రెప్పపాటు కరెంట్ పోకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.