రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు
సంక్రాంతి పండుగకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో విద్యార్థులు సొంత ఊళ్లు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. రద్దీ పెరిగితే అప్పటికప్పుడు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నది. అయినా బస్సులు దొరకడం లేదని కొంతమంది ప్రయాణికులు వాపోతున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నామని ఒక్క బస్సు కూడా రావడం లేదని అంటున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. ప్రయాణికులతో ఎల్బీనగర్ కూడలి రద్దీగా మారింది. వనస్థలిపురం, హయత్‌నగర్ వద్ద వాహనాలు అధిక సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతున్నది. మరోవైపు బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజ్ వద్ద భారీగా వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 12 టోల్ బూత్ ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను సిబ్బంది పంపిస్తున్నది.
ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వనపర్తి నుంచి మహబూబ్‌నగర్‌కు ఉదయం రూ. 100 ఉంటే సాయంత్రానికి రూ. 140 పెంచారని ఫైర్ అవుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రూ. 140 ఉండే టికెట్ రేటును సంక్రాంతి స్పెషల్ పేరుతో రూ. 210 పెంచిందని వాపోతున్నారు.
మరోవైపు రద్దీ దృష్ట్యా పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 17న 26 అదనపు రైళ్లను నడుపుతున్నది. చర్లపల్లి నుంచి విశాఖకు అదనపు రైళ్లను నడపనున్నది. సికింద్రాబాద్-బెంగళూరు మధ్య అదనపు రైళ్లను నడుపుతున్నది.