Telugu Global
Telangana

కొనసాగుతున్న సర్వశిక్షఅభియాన్‌ ఉద్యోగుల సమ్మె

25 రోజులుగా కొనసాగుతున్న సమ్మె.. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన

కొనసాగుతున్న సర్వశిక్షఅభియాన్‌ ఉద్యోగుల సమ్మె
X

సర్వశిక్షఅభియాన్‌ ఉద్యోగుల సమ్మె 25వ రోజు యథావిధిగా కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్నఅంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఓ మహిళా ఉద్యోగి తెలంగాణ తల్లి వేషదారణ ఆకట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురై ముగ్గురు ఉద్యోగులు మరణించారని తెలిపారు. తమను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీస్‌ క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా సర్వశిక్షఅభియాన్‌ ఉద్యోగుల సమ్మెలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు దీక్షలు చేస్తుండటంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు) లో క్లాసులు జరగకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 73 కేజీబీవీలో సుమారు 14 వేల మంది విద్యార్థులుచదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో పనిచేసే దాదాపు 2700 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్‌ 6 నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. రోజు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే స్కూళ్లలో విధులకు హాజరవుతున్నారు. దీంతో పాఠాలు బోధించేవారు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్‌, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉద్యోగుల ధర్నాతో బోధనలు నిలిచిపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమగ్ర శిక్ష ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయడం కష్టమని, విద్యాశాఖలో విలీనం చేయాలన్న డిమాండ్ కూడా న్యాయపరంగా కుదరదని ప్రభుత్వ అంటున్నది. ఇప్పుడు సమ్మె విరమించకుంటే వాళ్ల ఉద్యోగం రెన్యువల్ కూడా చేయమంటూ, ఉద్యోగం నుంచి తీసేసి వేరే వాళ్లని నియమిస్తామని ఉపాధ్యాయులపై రేవంత్ సర్కార్ సీరియస్ అవుతున్నది. దీనిపై ఉద్యోగులు ఫైర్‌ అవుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడుగుతున్నాం.ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కుదరదని అనడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు.


First Published:  3 Jan 2025 2:15 PM IST
Next Story