హైడ్రా అలర్ట్.. అక్కడ ప్లాట్లు కొనవద్దు
నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కొన్ని తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ హెచ్చరిక

ప్రజలు అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని హైడ్రా సూచించింది.నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కొన్ని తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలోని సర్వే నెంబర్ 50లో1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే అవుట్ వేసి అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదని పేర్కొన్నారు. జీవో నెంబర్ 131 ప్రకారం అనాథరైజ్డ్ లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. నగర పరిధిలో హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కుల కోసం , 30 శాతం రోడ్ల కోసం స్థలాలు కేటాయించాల్సి ఉన్నా ఆ నిబంధనలను పాటించడం లేదని హైడ్రాకు అందిన ఫిర్యాదుల్లో రంగనాథ్ గుర్తించారు.