అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బెయిలబల్ సెక్షన్లలో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
నాయకులు చెబితే పోలీసులు వినడం కాదు. బెయిలబుల్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పాయి. పండగ పూట డెకాయిట్, టెర్రరిస్టు లాగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం తప్పు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి కరీంనగర్ తీసుకెళ్లి దోమలు కుడుతున్నా రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారని హరీశ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో అంతకుముందు హరీశ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. పండగ కూడా చేసుకోనివ్వకుండా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో నిర్బంధాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఆగమేఘాల మీద అరెస్టు చేయడం దారుణమన్నారు. తాము న్యాయమైన పోరాటం చేస్తామని.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పోరాడతామని చెప్పారు.