ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తున్నది కాళేశ్వరమే
ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్
ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్‌లో గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. మంజీరా పాత లైను స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించాలని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డీపీఆర్ సిద్ధం చేయాలని జలమండలి బోర్డు భేటీలో సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వార్త క్లిప్ ను కేటీఆర్ జత చేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నికలకు ముందు ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లను తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
'ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!
మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!
తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!
ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు!
కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావని!
లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావని!
అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా…
నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం!' అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు.